Kaantha: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. డిసెంబర్ 12 నుంచి ఎక్కడ చూడాలంటే?
Kaantha: యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘కాంత’ ఓటీటీ విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నవంబర్ 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది.
‘కాంత’ చిత్రం డిసెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అంతేకాక, సముద్రఖని, దగ్గుబాటి రానా కీలక పాత్రల్లో నటించి సినిమాపై ఆసక్తిని పెంచారు.
‘కాంత’ చిత్రం ఒక థ్రిల్లింగ్ మిస్టరీ డ్రామా. అయ్య (సముద్రఖని) అనే ప్రఖ్యాత దర్శకుడు తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ అనే సినిమాను ప్రారంభించాలని అనుకుంటాడు. అందులో తన శిష్యుడైన టి.కె.మహదేవన్ (దుల్కర్ సల్మాన్) హీరోగా ఎంపికవుతాడు. అయితే, కారణాంతరాల వల్ల సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ప్రాజెక్ట్ను ‘కాంత’ పేరుతో మొదలుపెడతారు.
సినిమా సెట్లో హీరో మహదేవన్, దర్శకుడైన అయ్య మధ్య తీవ్రమైన వైరం నెలకొంటుంది. హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తుంది. అంతా సవ్యంగా జరుగుతోందనుకున్న దశలో, సినిమా బృందంలో ఒక కీలక వ్యక్తి దారుణంగా హత్యకు గురవుతాడు. దీంతో, ఆ నేరం ఒకరిపై ఒకరు రుద్దేసుకుంటారు. గురుశిష్యులైన హీరో, దర్శకుడు ఇద్దరూ పరస్పరం నిందలు వేసుకునే పరిస్థితి వస్తుంది.
ఈ మిస్టరీ కేసును ఛేదించడానికి ఇన్స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఈ దారుణానికి కారకులు ఎవరు? గురుశిష్యుల సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై లేదా ఇప్పుడు ఓటీటీలో తెలుసుకోవాల్సిందే. డిసెంబర్ 12 నుంచి ఈ ఉత్కంఠభరితమైన కథాంశాన్ని ఇంట్లోనే వీక్షించే అవకాశం లభించింది.
