Ananya Nagalla: వరుస హిట్స్ వచ్చినా అనన్య నాగళ్లకు కొత్త ప్రాజెక్ట్స్ కరువు
Ananya Nagalla: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘స్థానిక నటీమణులకు’ తగినన్ని అవకాశాలు దక్కడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ వంటి అచ్చ తెలుగు అమ్మాయిలకు స్టార్ డమ్ ఉన్నా, పెద్ద సినిమాలు దక్కడం కష్టంగా మారింది. ఈ జాబితాలోకి వస్తారు ప్రతిభావంతురాలైన అనన్య నాగళ్ల.
తెలంగాణలోని సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల, ముందుగా హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు. అయినప్పటికీ, సినిమాలపై ఉన్న మక్కువతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వీడి షార్ట్ ఫిలింస్‌లో నటించడం ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో ఆమె నటించిన ‘షాదీ’ అనే షార్ట్ ఫిలిం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాక, ఉత్తమ నటిగా సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌కు కూడా ఆమె నామినేట్ అయ్యారు.
షార్ట్ ఫిలింస్‌లో గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు తొలిసారిగా పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’, పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, నితిన్ ‘మ్యాస్ట్రో’, సమంత ‘శాకుంతలం’, ‘మళ్లీ పెళ్లి’, ‘అన్వేషి’, ‘డార్లింగ్’ వంటి పలు సినిమాల్లో నటించి తన నటనకు నిరూపించుకున్నారు.
ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘పొట్టేల్’, ‘తంత్ర’, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాలు అనన్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. అయినప్పటికీ, ఆమెకు పెద్దగా కొత్త అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ తర్వాత ఆమె కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ప్రొఫెషనల్‌గా అవకాశాలు తగ్గినా, అనన్య సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటారు. తరచుగా సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాక, హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆమె సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించి, వైరల్‌గా మారాయి. నటనలో ప్రతిభ ఉన్నప్పటికీ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడాన్ని ఈ సంఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
