రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులను విమర్శించడం.. ట్రోల్ చేయడం ఈ రోజుల్లో ఒక సాధారణ విషయం గా అయిపోయింది. కానీ అదే సమయంలో ఎదుటి కులాలను గౌరవించాలి అనే నియమాల్ని దాటి సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం.. అదీ ఒక పార్టీ పేరు చెప్పుకుంటూ ఒక కులానికి సంబంధించిన వారి మనోభావాలను దెబ్బ తీయడం ఎంత వరకూ సమంజసం? సోషల్ మీడియాలో నోటి దురుసుతనంతో ఏం మాట్లాడినా మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు అనే ధోరణి బాగా అలవాటైంది. తమ వ్యక్తిగత ప్రచారం కోసం బరితెగించి వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం పరిపాటిగా మారింది.
తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ఒక హాస్య ప్రధానమైన టీవీ షోలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని అనుకరిస్తూ వికలాంగుడైన ఒక వ్యక్తి చేసిన స్కిట్ ప్రోమో సంచలనం రేపింది. ఆ ప్రోమో విడుదలైన తర్వాత తదనంతర పరిణామాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రోమో చూసిన వైసీపీ కార్యకర్తలు ఆ పాత్రలో నటించిన వ్యక్తిని, కొణిదెల నాగబాబు, శ్రీముఖి జానీ మాస్టర్ లను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణం గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వారి ఫోటోలను మార్పింగ్ చేస్తూ చనిపోయారంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దీనితో టీవీ యాజమాన్యం ప్రోమోని తొలగించింది. సదరు నటుడు క్షమాపణలు చెప్పినా సరే వైసిపి వర్గాలనుండి దాడి తగ్గకపోగా మరింత ఎక్కువైంది. దీనికి జనసేన సోషల్ మీడియా వర్గాలు రంగంలోకి దిగి రివర్స్ ఎటాక్ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ఈ గొడవ చల్లారక ముందే వైసీపీ తరపున అమెరికాలో ఉండే ఒక ఎన్నారై మహిళ చేసిన వీడియో కారణంగా ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధమైన వాతావరణం ఏర్పడింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లను వ్యక్తిగత దూషణ చేస్తూ వారి కుటుంబ మహిళలను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా వారి సామాజిక వర్గాన్ని అవమానిస్తూ ఆమె మాట్లాడిన మాటలు రాష్ట్రవ్యాప్తంగా కులాల కుంపట్ల రగిలేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన కాపు సామాజిక వర్గం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎన్ఆర్ఐ మహిళపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీ అండతో అవాకులు చవాకులు మాట్లాడుతున్న ఆ మహిళ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి నటులు, మిమిక్రీ ఆర్టిస్టులు ప్రముఖ వ్యక్తులను అనుకరించడం చాలా సాధారణమైన విషయం. సినీ, రాజకీయ ప్రముఖులను అనుకరిస్తూ ఎంతో మంది కళాకారులు గుర్తింపు తెచ్చుకున్నారు. సాక్షాత్తు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని శివా రెడ్డి అనే ఆర్టిస్ట్ ఆయన ముందే ఇమిటేషన్ చేస్తే ఆయన చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు తప్పితే ఇంత ఉన్మాదంగా దాడి చేయలేదు.పైగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఇప్పటి దాకా ఎవరూ అనుకరణ చేయలేదు అనడానికి కూడా లేదు. ఆయన పార్టీ కార్యకర్తల్లోనే చాలా మంది ఆయన్ని అనుకరిస్తూ కొన్ని వందల టిక్ టాక్ వీడియోలు చేశారు. మరి వాళ్ళు చేసినప్పుడు దెబ్బతినని మనోభావాలు కేవలం నాగబాబు జడ్జిగా ఉన్న షో లో చేసిన దాని వల్లే దెబ్బతిన్నాయి అంటే కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుగానే పరిగణించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్ర హక్కు ని నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు అంటూ గింజుకునే మేధావులు అదే హక్కుని దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి వారిపై మాత్రం నోరు మెదపరు. రాష్ట్రంలో మెజార్టీ వర్గం అయిన కాపు సామాజిక వర్గాన్ని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అవమానిస్తూ మాట్లాడుతున్న ఇలాంటివారిని కంట్రోల్ చేసి ఈ వివాదానికి ముగింపు పలకక పోతే వైసీపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీ నుండి కనీస ఖండన కూడా లేకపోవడం దారుణం.