ఎన్ని దఫాలు చర్చలు జరిగినా.. “ఆర్టీసి అధికారులు మధ్య చర్చలు విఫలం” ఈ స్టేట్మెంట్ తప్ప వేరే స్టేట్మెంట్ రావడం లేదు. ఇండియాలో లాక్ డౌన్ సడలింపులు మొదలయ్యక అన్ని రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలకి ఆర్టీసి బస్సులు తిప్పుతున్నాయి కానీ సీమాంధ్ర తెలంగాణా మధ్య మాత్రం తిరగడం లేదు. చర్చలు విఫలం అవ్వడానికి కారణం కూడా మారడం లేదు. ఏపియస్ఆర్టీసి బస్సులు తెలంగాణాలో తిరిగే కి.మీ లెక్కలే కారణం గా చూపుతున్నారు.
బుధవారం ఏపి తెలంగాణ ఆర్టీసి అధికారుల మధ్య బస్ భవన్ లో జరిగిన సమావేశం మరోసారి విఫలం అయింది. అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణా ఆర్టీసి అధికారులు తెలంగాణాలో తిరిగే ఏపి బస్సులు తగ్గించాలని యధావిధిగా అదే ప్రశ్నతో మీటింగ్ మొదలుపెట్టారట.
అధికారిక లెక్కల ప్రకారం లాక్ డౌన్ ముందు వరకూ ఆర్టీసీ బస్సులు తిరిగుతున్న కిలోమీటర్లు లెక్కలు చూస్తే ఏపి ఆర్టీసి బస్సులు తెలంగాణాలో 2.67 లక్షల కిలోమీటర్లు మేర తిరుగుతున్నాయి, అదే టైంలో తెలంగాణా బస్సులు సీమాంధ్రాలో 1.64 లక్షల కి.మీ మాత్రమే తిరిగేవి.
తెలంగాణా అధికారులు మాత్రం ఖరాకండిగా మేము తిప్పినంత మాత్రమే మీరు మా రాష్ట్రంలో తిప్పాలి అని చెప్తున్నారు. అందుకు ఏపి అధికారులు కూడా ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది.
త్వరలో దసరా వస్తుండటంతో ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని మరోసారి సమావేశం పెట్టినా.. సమావేశం పెట్టిన శ్రధ్దలో కొంచెం కూడా సఫలం అవ్వడంలో పెట్టడంలేదు అధికారులు. ఒక పక్క దసరా వస్తుంది ప్రజలు సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క బస్సులు లేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఆర్టీసి యూనియన్ కూడా త్వరగా సమస్య పరిష్కరించి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగేలా చూడాలని కోరుతుంది.
మీడియా పైకి చెప్పకలేకపోయినా, ఆర్టీసీ అధికారులు వాళ్ల ఇగోలకి పోయి ప్రజలని ఇబ్బందులు పెడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఆర్టీసీ పంచాయితీకి కూడా ఇరు రాష్ట్రాల సిఎం లు ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది.