భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయరాజే సింధియా గారి గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఆమె పేరిట 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. విజయరాజే గారి శతజయంతి సందర్భంగా ఆమె పేరు మీద ముద్రించిన స్మారక నాణాన్ని సోమవారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేశారు.
అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం(రాజ్ సత్తా) కన్నా ప్రజలకు సేవ చేయడమే(జన్ సత్తా) ముఖ్యమని రాజమాత(విజయరాజే సింధియా) నిరూపించారని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
ఇంకా మోడీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల వరకు ముఖ్య రాజకీయ ఘటనలకు రాజమాత ప్రత్యక్షసాక్షిగా నిలిచారని కొనియాడారు.
అలాగే గత 60 సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఓ దిశను చూపిన అత్యంత ప్రముఖమైన రాజకీయవేత్తలలో రాజమాత సింధియా కూడా ఒకరని చెప్పారు. స్వాతంత్య్రానికి ముందు విదేశీ దుస్తుల కాల్చడం మొదలుకుని, రామ మందిరం నిర్మాణం కోసం చేసిన ఆందోళన వరకు ఆమె సేవలు చాలా గొప్పవని పునరుధ్ఘాటించారు. అయోధ్య లోని రామ జన్మభూమి కోసం ఆమె పడిన కష్టం మేము ఇప్పటికీ మర్చిపోలేదని. ఆమె శత జయంతి వేళ రామ మందిర కల సాకారం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు మోడీ.