అటెన్షన్ పాలిటిక్స్.. డైవర్షన్ పాలిటిక్స్.. ఈ విషయాలలో మన నాయకులు పి.హెచ్.డిలు చేశారు అనిపిస్తుంది. ఏదైనా సమస్య చర్చలోకి వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో కొత్త సమస్య తెరపైకి తీసుకు వస్తారు. లేదా తాము నిశ్శబ్దంగా చేయాలనుకుంటున్న పని గురించి ఎవరూ చర్చించకుండా కొత్త వివాదాన్ని సృష్టించి తాము చేయాలనుకున్న పనిని సైలెంట్ గా చేసుకుని పోతుంటారు.
అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో మరే ఇతర సమస్యా లేనట్టు, కరకట్టపై చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇవ్వడం పెద్ద ఘనకార్యం అన్నట్టు వైసిపి సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తుంది.
“ఆ ఇల్లు నాది కాదు మొర్రో” అని చంద్రబాబు ఎన్నిసార్లు తలకొట్టుకున్నా ఆ ఇంటిని కూల్చేస్తాం అని ఇప్పటికి పలు దఫాలుగా నోటీసులు ఇస్తున్నారు. పోనీ అక్రమ కట్టడం అని చెప్పి కూల్చేస్తారా? అంటే అదీ లేదు. అధికారంలోకి రాగానే జనం సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చేసి సంకలు గుద్దుకున్న వైసీపీ ప్రభుత్వం, అదే స్పీడ్ లో చంద్రబాబు ఇంటిని ఎందుకు కూల్చడం లేదో ఎవరికీ అర్థం కాదు. పోని అదే కరకట్ట మీద ఉన్న మిగతా అక్రమ నిర్మాణాల్లో మాజీ బిజెపి ఎంపి గోకరాజు గంగరాజు ఇల్లు, శివ స్వామి మఠం కూడా ఉన్నాయ్ మరి వాటి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఇచ్చారా అంటే అదీ లేదు.
చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వానికి ఆ ఇంటిని కూల్చే ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ ఇంటిని కూలిస్తే తన సొంత ఇల్లు కానప్పటికీ పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోయే చంద్రబాబు, ఆ కూల్చిన ఇంటి ఇటుకలపై కూర్చొని తన అను “కుల” మీడియా ద్వారా ప్రజల చెవుల్లోంచి రక్తం వచ్చే రీతిలో జగన్ ని తిడుతూ.. శాపనార్థాలు పెడుతూ.. సింపతి ఎక్కడ తెచ్చుకుంటాడో అని వైసీపి భయ పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో వైసీపీకి ఆలోచన లేదని అర్ధం అవుతుంది. అందువల్ల ఇప్పుడొస్తున్న చంద్రబాబు కరకట్ట కొంప గురించిన వార్తలు ఏదో విషయాన్ని డైవర్ట్ చేయడానికో అని మాత్రమే అనుమనించాలి..
పైగా పోయిన సారి వరదలకు అమరావతి మునిగిపోయింది అంటూ వైసిపి నాయకులు, వారి అనుకూల మీడియా ఈ సారి ఆ విషయాన్ని గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. బహుశా పోయిన సారి ఆ పాచిక పెద్దగా పారలేదు అని పక్కన పట్టేశారు ఏమో అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.