దైనందిన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజల జీవితాల్లో ఒక్క సారిగా అనుకోని మార్పులు ఎదురవుతాయి. హైదరాబాద్ కి సంభవించిన వరదలు కూడా అలాంటి సంఘటనే.. తమ జీవితంలో అలాంటి సంఘటనలు చూస్తామని నగరజీవి కలలో కూడా ఊహించి ఉండడు. వరదల వలన ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. మరెందరో ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు అలాంటి వారికి కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏమిటంటే వర్షాల వల్ల సర్టిఫికెట్లు నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని, వారు తగిన ఆధారాలతోపాటు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఇది అన్ని తరగతుల వారికి వర్తిస్తుందని, సాధారణ పరిస్థితుల ఏర్పడిన తర్వాత సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
అకాల వర్షాలు ఇప్పటికీ విడకపోవడం వలన హైదరాబాద్ లో సామన్యుల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు తయారయ్యింది. వారిని వీరిని అనే తేడా లేకుండా అందరినీ ఒక ఆట ఆడుకున్నాయి వర్షాలు. వరదల దాటికి వేల ఇళ్లు నీటమునిగిపోగా ఆ వరదల్లో చాలామంది తెలంగాణా విద్యార్థులు వారి వారి విలువైన సర్టిఫికేట్ లు కూడా కోల్పోయారు.ఈ విషయం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి వెళ్లగానే వేగంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సర్టిఫికేట్ లు కోల్పోయిన విద్యార్థులు ఊపరిపీల్చుకున్నట్టు అయింది.