ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రకుల పెత్తనం పెరిగింది అని వాదించేవారికి కొద్దిగా సంతోషం కలిగించే వార్తలు రెండు రోజుల నుంచి వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తమ నూతన అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడుని నియమించి తాము బీసీల పక్షమని చెప్పకనే చెప్పింది.
టీడీపీ ఆవిర్భావం దగ్గర నుంచి బీసీలు వారికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఒక రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బీసీ నాయకులు ఎక్కువగా టీడీపీలోనే ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో టీడీపీ బలహీన పడటంతో చాలామంది నాయకులు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిపోయారు.ఇక ఆంధ్రప్రదేశ్ లో సైతం టీడీపీకి బీసీల్లో ఆదరణ తగ్గినట్టు గత ఎన్నికల్లో తేలిపోయింది. ఆయా వర్గాల్లో పోయిన తమ ఆధిపత్యాన్ని తిరిగి నిలుపుకోవడమే లక్ష్యంగా అచ్చెన్నాయుడుని రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ నియమించిందని భావించవచ్చు.
అధికార వైసీపీ కూడా బీసీ ఓటు బ్యాంకు పై మరింత వేగంగా కన్నేసింది.ఇప్పటికే కొన్ని కీలకమైన మంత్రి పదవులు కట్టబెట్టడతో బాటు ఇప్పుడు కొత్తగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరో ముందడుగు వేసింది.139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతోంది. ఒక్కో కార్పొరేషన్ కు 12 మంది పాలక వర్గ సబ్యులను కూడా నియమించి వారిని పార్టీ వైపు సంపూర్ణంగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత గుర్తించిన పార్టీలు ఇప్పుడు బీసీ జపాన్ని మొదలు పెట్టాయి.మరోవైపు టీడీపీ నాయకులు జగన్ కేవలం బీసీలని మభ్యపెట్టడానికె కార్పొరేషన్లు వేస్తున్నాడని ఇప్పటి వరకూ ఏర్పడ్డ కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లకే నిధులు కేటాయింపు చెయ్యడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.