ఒక పక్క కోవిడ్ కారణంగా వ్యాపార వాణిజ్య కలాపాలు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించడం వలన మధ్యతరగతి వారిలో చాలామందికి ఉపాధి లేని పరిస్థితి. అరకొర ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సగటు జీవికి ఇప్పుడు కూరగాయల ధరలు షాక్ ఇస్తున్నాయి.
దసరా సీజన్ కావడం వలన చాలామంది శరన్నవరాత్రుల సమయంలో పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకుంటారు. రాష్ట్రంలో చాలామంది దుర్గాదేవి మాల ధారణ చేసి పూర్తిగా శాకాహారానికి పరిమితమై ఉంటారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా కాయగూరలకు డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాయగూరల పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. దీనితో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు ఉల్లి ధర అమాంతంగా పెరగడంతో మధ్య, దిగువ స్థాయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
రైతు బజార్ రేట్లకి, బహిరంగ మార్కెట్ రేట్ కి వ్యత్యాసం ఉంటుంది. కానీ ఏ రైతు బజార్ లోనూ సరైన కాయగూరలు దొరకడం లేదు. రెండు మూడు రకాలు తప్ప పెద్దగా కూరగాయలు రైతు బజార్ లో అందుబాటులో ఉండటం లేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ కి తరలి వెళ్లాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్ వ్యాపారులు కూరగాయల ధరలు అమాంతం పెంచారు. ఉల్లిపాయ రైతు బజార్ లో 50.రూ, బహిరంగ మార్కెట్లో 80.రూ గా ఉంది. దేశవాళీ చిక్కుళ్ళు రైతుబజార్ లోనే ₹100 గా ఉండగా బహిరంగ మార్కెట్లో కేజీ 140. రూ వరకు పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో నిత్యం దొరికే కూరగాయల ధరలు బంగాళదుంప 60.రూ, వంకాయ 60.రూ, క్యారెట్ 70 రూ. బీట్రూట్ 70.రూ ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు.
ప్రభుత్వాలు స్పందించి కనీసం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోనే ఉల్లి, బంగాళదుంప లాంటివి రైతు బజార్ లో తక్కువ ధరకు అందించగలిగితే కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది.