తమ బిడ్డ అనారోగ్యానికి ఆపరేషన్ చేయించేందుకు కనీసం ముంబై వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా చేయూత అందించక పోతారా అని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఎంతోమందికి సహాయం చేస్తున్న మానవతావాది హీరో సోనూ సూద్ వారి పరిస్థితి చలించి ఆదుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో గడ్డం కోటయ్య, పుల్లమ్మ దంపతుల మూడవ కూతురు15 నెలలు వయసు గల చిన్నారి గుండె జబ్బుతో బాధ పడుతుంది. పేద కుటుంబం కావటం తో అప్పులు చేసి 2లక్షలు ఖర్చు పెట్టి విజయవాడ ,హైదరాబాద్ ల్లో చిన్నారికి చికిత్స చేయించారు ఆ దంపతులు.
అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడలేదు. మెరుగైన వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్ధిక స్తోమత లేక చిన్నారి ఆరోగ్యం పై ఆందోళన చెందిన తల్లితండ్రులు నిరాశగా ఎదురుచూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న తిరువూరు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రాంప్రదీప్, గంగాధర్ సమస్యను బాలీవుడ్ రియల్ హీరో సోను సూద్ కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
పరోపకారమే పరమావధిగా మానవత్వానికి నిలువెత్తు రూపం అయిన సోను సూద్ వెంటనే స్పందించి చిన్నారి గుండె ఆపరేషన్ కు అయ్యే ఖర్చులు భరిస్తానని తన మేనేజర్ గోవింద్ అగర్వాల్ ద్వారా జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సోను సూద్ స్పందన పట్ల నియోజకవర్గం వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారి గుండె ఆపరేషన్ కు ముంబై లో ఏర్పాట్లు చేయించిన హీరో సోనుసూద్ ముంబై రావడానికి కావల్సిన రవాణా ఏర్పాట్లు కూడా తన సిబ్బంది ద్వారా చేశారు. విషయం తెలిసిన చిన్నారి తల్లి కన్నీటి పర్యంతం అవుతూ సోను సూద్ కి ధన్యవాదాలు తెలిపారు.