కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి. టీడీపీలో కీలకమైన నాయకులని చేర్చుకునే క్రమంలో సొంత పార్టీలోనే కొత్త తలనొప్పులు తెచ్చుకుని ఇబ్బందులపాలవుతోంది. టీడీపీలో కీలకమైన నాయకుడు వల్లభనేని వంశీ చేరికతో కృష్ణా జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టె వ్యూహంలో సక్సెస్ అయినా, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం తిరుగుబాటుతో పరిస్థితి అదుపు తప్పింది.
తాజాగా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ కి వ్యతిరేక వర్గాలు ఏకతాటి పైకి వచ్చాయి. యార్లగడ్డ వెంకట్రావు, దుత్తా రామచంద్రరావు, దాసరి బలవర్దన్ రావు వర్గాలు వంశీకి వ్యతిరేకంగా పార్టీకి తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు.
వల్లభనేని వంశీ ని పార్టీలో ఒంటరి చేసి తిరిగి ఇంచార్జ్ అవ్వాలని యార్లగడ్డ ఎత్తులు వేస్తున్నారు. గత పర్యటనలో పార్టీ అధినేత జగన్ అందరూ కలిసి ముందుకు సాగాలని నచ్చజెప్పారు. అయినా సరే కలిసి పని చేయడానికి ససేమిరా అంటూ యార్లగడ్డ, దుత్తా వర్గాలు నియోజకవర్గంలో రెచ్చగొట్టే విధమైన కార్య కలాపాలు చేస్తున్నారు. అంతేకాక వంశీకి వైసిపిలో క్యాడర్ ఎవరు దగ్గర అవ్వకుండా ముగ్గురు నాయకులు ఒక కూటమిగా ఏర్పడ్డారు.
గతంలోనే దుత్తా రామచంద్రరావు జగన్ కాళ్లు పట్టుకొని వల్లభనేని వంశీ వైసీపీ లోకి వచ్చాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీలో కార్యకర్తలను వంశీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసాడని, అలాంటి వ్యక్తికి పార్టీలో ప్రాముఖ్యత ఇవ్వడం తమకు రుచించడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి పార్టీలోని అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీ కోవిడ్ బారినపడిన ఈ సందర్భంలో ఈ వివాదాలు మంచిదికాదని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో పక్కన పెడితే ఇకనైనా ఎవరినైనా పార్టీలో చేర్చుకోవాలంటే అప్పటికే పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాయకులని ఒకటికి రెండు సార్లు సంప్రదించి ముందుకు వెళ్లడం బెటర్ అనే విషయం పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
