పెట్రోల్ పై సుంకాల బాదుడు వలన ప్రతీ నెల వేల రూపాయలు అదనంగా చేతి చమురు వదిలించుకుంటున్న టూ వీలర్ వాహన దారులకు, ట్రాఫిక్ పోలీసుల చలానాలు చెళ్ళుమని కొరడా దెబ్బలు తిన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయ్..
ప్రచార ఆర్భాటం కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే ఏపీ పోలీసులు, పోలిటికల్ పోలీసింగ్ చేస్తూ ప్రభుత్వానికి రెవిన్యూ డిపార్ట్మెంట్ తో సమానమైన ఆదాయాన్ని ట్రాఫీక్ విభాగం నుంచి అందిస్తున్నారు.
సిటీకి ఎంతోమంది కమిషనర్ లు వస్తుంటారు..పోతుంటారు.. బట్ చంటి గాడు లోకల్ అని… అదే తీరులో 5 ఏళ్ళకోకసారి ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త సీయం లు వస్తుంటారు, వెళుతుంటారు… బట్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం 30 ఏళ్ళ పైబడి ప్రజా సేవలో ఉంటారు…
కానీ ప్రస్తుతం శాఖాధిపతులే ముఖ్య మంత్రుల ముందు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. దాంతో క్రింది స్దాయి ఉద్యోగులు తమ విధేయత చూపడంలో కొత్త పదాలు కనిపెట్టే రీతిలో వంగి వంగి సలాములు చేస్తున పరిస్థితి.
తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన ఉచిత పథకాలకు, నిధులు సమకూర్చే పార్టీ కార్యకర్తల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఫైన్ లతో మద్య తరగతి నడ్డి విరగ్గొడతున్నారు.
దైనందిన జీవితంలో కోవిడ్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న మధ్యతరగతి మనిషికి, టూ వీలర్ చలానా కోవిడ్ మహమ్మారి కంటే ఎక్కువ భయపెడుతుంది.
మానవత్వం అనేది ఏ కోశానా లేకుండా, చేతిలో సెల్ ఫోన్ తో ఇష్టానుసారం తీసే ఫోటోలతో ట్రాఫిక్ బాబాయ్ లు విధించే చలానాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే స్వయంకృతాపరాధం అవుతుంది, కానీ పిచ్చోడి చేతిలో రాయి మాదిరి, ట్రాఫిక్ పోలీస్ చేతిలో సెల్ ఫోన్ ఫోటోనే ఆధారంగా ముక్కు పిండి వసూలు చేస్తున్న చలానాల విషయంలో ఏపీ ప్రజలు విసిగెత్తిపోయారు.
రోడ్లు మరమ్మతులు చేయకుండా, బొక్కలు పడిన రోడ్లపై నడ్డి విరుగుతున్నా కిమ్మనకుండా తమకు దాపురించిన దౌర్భాగ్యం అంటూ సరిపెట్టుకున్న, మధ్య తరగతి జీవులు చలానాల విషయంలో మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారనే చెప్పాలి..
రాబోయే రోజుల్లో వీళ్ళందరూ రూలింగ్ పార్టీకి…
ఓటర్ రూల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి రెడిగా ఉన్నారనేది పబ్లిక్ టాక్..
