ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల టైం ఉంది కానీ ఇప్పటి నుండే ప్రధాన పార్టీలు ఎలక్షన్ ఫీవర్ ను చూపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, ఈసారి ఏకంగా మొత్తం 175 సీట్లు గెలుస్తాం అంటూ గాల్లో విహరిస్తుంది, కామెడీగా కుప్పం గెలుస్తామని చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పావులు కదుపుతున్నారు. జనవరిలో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు అలాగే బస్సు యాత్ర ద్వారా జనంలోకి పవన్ ప్లాన్ చేస్తున్నారు.
పార్టీల్లోకి వలసలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. నిన్నటి నుండి పొలిటికల్ సర్కిల్ లో ప్రముఖ కమెడీయన్ నటుడు ఆలీ జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారనే వార్త బాగా తిరుగుతోంది. ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఆలీ మాత్రం అధికార వైసీపీలో ఉన్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో ఆలీకి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా సరే ఆలీ జనసేనలో చేరకుండా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. జగన్ గెలుపు కోసం ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఆలీకి మంచి పదవి ఇస్తారు అనే ప్రచారం బాగా సాగింది.
సీఎం జగన్ కుడా పలుసార్లు ఆలీని పిలిపించుకుని మాట్లాడారే తప్ప రాజ్యసభ సీటును కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వలేదు. అలా అవ్వకపోయేసరికి చట్టసభలు కాదు కీలకమైన కార్పొరేషన్ పదవి ఆలీకి ఇస్తారని వైసీపీ వర్గాల్లో టాక్ నడిచింది కాని ఇప్పటివరకు ఏమి జరగలేదు.
దీంతో వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆలీ పార్టీ మారాలని చూస్తోన్నట్టు తెలుస్తోంది. వైసీపీ తనకు అన్యాయం చేసిందనే భావనలో ఉన్న ఆలీ జనసేన పార్టీలో చేరి తన ఎమ్మెల్యే అవ్వాలనే ఆశయాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందులోను ఆలీ సొంత జిల్లా తూర్పుగోదావరి. ఆ జిల్లాలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి బాగా బలం ఉంది.
జనసేనలో చేరి రాజమండ్రి లేదా రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలీ అనుకుంటున్నారట. ఈ రెండు చోట్ల వీలుకాని పక్షంలో తూర్పుగోదావరి జిల్లాలో మరేదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో హీరో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆలీ పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారా ? అసలు అలీ కి జనసేన గేట్లు తీస్తారా అంటే అభిమానులు మాత్రం ససేమిరా అనేఅంటున్నారు. మరి జనసేనాని ఏమంటారో చూడాలి.
