2008లో మాంద్యం వచ్చినపుడు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు మనం చూసాం. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇపుడు మళ్ళీ ప్రపంచం మరో మాంద్యం వైపు పయనిస్తోందని చాలా ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి అయిదు సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి.
పడిపోతున్న మార్కెట్లు: 2008 తర్వాత అంతలా మార్కెట్లు పడిపోయిన సంవత్సరంగా మనం 2022ని చెప్పుకోవచ్చు. ఇప్పట్లో మార్కెట్లు కోలుకునేలా లేవు. 2021 అక్టోబరు నెలలో సెన్సెక్స్ 59,984 పాయింట్లు ఉండగా, సంవత్సరం తర్వాత 58,111 గా ఉంది. అంటే మార్కెట్లో ఇన్వెస్టర్లు డబ్బు సంపాదించటం అటుంచి ఇప్పటికే చాలా పోగొట్టుకున్నారన్న మాట.
మందకొడి వ్యాపారం: కోవిడ్ ఇచ్చిన షాక్ తర్వాత వ్యాపారం వృద్ధి చెందినప్పటికీ, గత కొన్ని నెలలుగా ఇది సాఫీగా సాగడం లేదు. కోవిడ్ దెబ్బనుండి ప్రపంచం ఇంకా కోలుకోకముందే, పుతిన్ పంజా విసిరాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు మందకొడిగా తయారయ్యాయి.
కుంటుపడ్డ అమెరికా ఆర్థిక వ్యవస్థ: పెరిగిపోయిన ఇంటరెస్ట్ రేటుల మూలంగా పెద్దన్న అమెరికాలో జనాల జేబులు ఖాళీ అవుతున్నాయి. హౌస్ లోన్ల EMI లు పెరిగాయి. ఖర్చు పెట్టడానికి డబ్బులు మిగలక జనాలు షాపింగ్ లాంటివి చేయటం లేదు. గిరాకీ తగ్గి వ్యాపారం తగ్గుతోంది.
US డాలర్: గత కొన్ని నెలలుగా అమెరికా డాలర్ విలువ పెరుగుతూ వస్తోంది, రాబోయే రోజుల్లో విలువ మరింత బలంగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. డాలరు పెరిగితే దాని దెబ్బ వర్ధమాన దేశాలయిన భారత్ లాంటి వాటిపైన గట్టిగా పడుతుంది. భారత్ దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడ్డ దేశం. డాలర్ పెరిగితే వస్తువులు, యంత్రాలు, ముడిసరుకుల దిగుమతికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇది భారత్ లాంటి దేశాలకు మామూలు దెబ్బ కాదు.
యుద్ధం మరియు ద్రవ్యోల్బణం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు మిన్నంటుతున్నాయి. రష్యా గ్యాస్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, ఇంధన ధరలు పెరిగాయి మరియు సరఫరాలు తగ్గిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపునకు దారితీసినందున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు కొత్తవారికి జాబులు ఇవ్వటం దేవుడెరుగు ఇపుడు ఉన్న సిబ్బందిని తగ్గించే యోచనలో ఉన్నాయి. ఇహ 10 శాతం ద్రవ్యోల్బణంతో ఒకప్పుడు దేశాల్ని ఏలిన బ్రిటిషర్లు ఇపుడు నిత్యావసరాల్ని కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
మరి మాంద్యం మనల్ని ఎపుడు తాకుతుంది?
మాంద్యం తప్పనిసరి అని నిపుణులు అందరూ ఏకాభిప్రాయంతో చెబుతున్న మాట. యుద్ధంతో భారత్ డైరెక్టుగా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మనకు మాంద్యం కాస్త లేటు అవ్వోచ్చేమో గానే రావటం మాత్రం పక్కా.. చాలా మంది విశ్లేషకులు ఇది 2023లో ఎప్పుడైనా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో లేదా ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ అంచనా వేయలేదు.