ఒక్క సంఘటన.. ఒకే ఒక సంఘటన జీవితాన్నే మార్చేస్తుంది. అది కొందరికి వరమవుతే మరికొందరికి శాపం అవుతుంది. ఓ వైపు ఎలక్ట్రానిక్ మీడియా నెగటివ్ వార్తలు, మరో వైపు సోషల్ లో దారుణమైన ట్రోలింగ్ వీటన్నింటిని తట్టుకొని ఎదురు నిలిచిన వ్యక్తే ఖుషిత కల్లపు.
నిరాశ చెంది ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆమె జీవితం ఇంకోలా ఉండేది. కానీ ధైర్యంగా నిలబడి విజయావకాశాల్ని అందుకుంది..!!అసలు ఎవరు ఖుషిత..? ఏం జరిగింది అంటే.. తొలుత షార్ట్ ఫిలిమ్స్ తో తర్వాత ఇన్స్టా ద్వారా ఫేమస్ అయిన వ్యక్తి ఖుషిత.
ఆ మధ్య హైదరాబాద్ లో ఓ ప్రముఖ పబ్ పై జరిగిన దాడుల్లో ఈ అమ్మడు చిక్కింది. పబ్ కి బజ్జీలు తినడానికి వెళ్ళానని అప్పట్లో పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో సోషల్ మీడియా లో “బజ్జీల పాప”గా దారుణమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంది. పబ్ లో డ్రగ్స్ దొరికితే ఆ పబ్ కి వెళ్లిన వాళ్ళు అంతా డ్రగ్స్ తీసుకున్నట్టేనా..? అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించింది.
బజ్జీల పాప అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నా ఎక్కడా క్రుంగిపోలేదు. ధైర్యంగా నిలబడింది. సీన్ కట్ చేస్తే.. ఇపుడు టాలీవుడ్ మాస్ రాజా రవితేజ.. సొంత ప్రొడక్షన్ సంస్థలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమాలో ఆమెకి జోడీగా నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం హీరో కాగా “ఛాంగురే బంగారు రాజా” టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. మొత్తానికి సోషల్ మీడియాతో పాపులర్ అయిన ఖుషిత ఇలా రవితేజ దృష్టిలో పడి హీరోయిన్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
అలాగే బిగ్ బాస్ రన్నర్ మానస్ నటిస్తున్న “చిలసౌ రాంబాబు” అనే వెబ్ సిరీస్‌లో కూడా ఖుషిత కీలక పాత్రలో నటిస్తోంది.ఇవే కనుక హిట్ అవుతే ఖుషిత ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
జీవితంలో కష్టాలు, అవమానాలు వస్తూనే ఉంటాయి.. వాటిని మోస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. వాటిని విదిలించి ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తాం అనడానికి ఖుషిత కల్లపు ఓ ఉదాహరణ. రేపు ఖుషిత హీరోయిన్ గా ఎంతగా సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.