పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. రీఎంట్రీ తర్వాత పవన్ వకీల్‌సాబ్ చిత్రానికి 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ వాటన్నింటిని పటాపంచల్ చేశారు పవన్ కళ్యాణ్. తాను తీసుకునే అసలు పారితోషికం ఎంతో మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో 6 సినిమాలను చేశానని, వీటిన్నంటికి కలిపి తనకు 100 కోట్ల నుంచి 120 కోట్లు పారితోషికంగా వచ్చిందని చెప్పారు. అయితే ఇందులో 33.37కోట్లు టాక్స్ రూపంలోనే కట్టారట. జీఎస్టీ కాకుండా ఈ మొత్తాన్ని తాను ప్రభుత్వానికి చెల్లించినట్టు తెలిపారు పవన్.
తన పిల్లల పేర్లపై డిపాజిట్ చేసిన మనీని కూడా వాడుకుని జనసేన ఆఫీస్ కట్టానని, పార్టీకి 5 కోట్ల ఫండ్ ఇచ్చానని, దాదాపు 12కోట్లు విరాళాలే ఇచ్చానని చెప్పారు పవన్. అందులో 30 లక్షలు అయోధ్యకి కూడా అందించారట. అంటే ఈ లెక్కన ఒక్కో సినిమాకి పవన్ కేవలం 20కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. పవన్ నటించే సినిమా గట్టిగా కలెక్ట్ చేస్తే 100 కోట్లు వస్తుంది. అదే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తుంది. అలాంటిది ఆయన కేవలం 20 కోట్లే పారితోషికం తీసుకోవడంతో అభిమానులను సైతం షాక్ అవుతున్నారు.
