పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ కథాంశంతో ఏయం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. మొఘల్ రాజుల కాలానికి చెందిన ఒక బందిపోటు దొంగ కథతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఒకవార్త హల్చల్ చేస్తోంది. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్ర కోసం బాబీడియోల్ ని క్రిష్ సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఇటీవల బాబీడియోల్‌ను కలిసిన క్రిష్ అతడికి కథను వినిపించినట్లు చెబుతున్నారు. కథ వినగానే ఈ పీరియాడికల్ సినిమాలో నటించడానికి బాబీ డియోల్ వెంటనే అంగీకరించినట్లు తెలిసింది.
త్వరలో నవంబర్‌లో బాబీడియోల్ హరిహరవీరమల్లు షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతారు అని చెబుతున్నారు. కాగా హరిహరవీరమల్లు తాజా షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో పవన్‌కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం యుద్ధ విద్యల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పంచమి అనే పాత్రలో కనిపించబోతున్నది. బాహుబలి సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.