ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. నగరంలోని మియాపూర్ ఆదిత్యానగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. తనను దూరం పెడుతుందనే కోపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం.
ఇక దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని తీవ్రంగా గాయపర్చాడు ఆ ప్రేమోన్మాది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం తాను గొంతు కోసుకుని ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. బాధితురాలిని వైభవిగా, తల్లి శోభగా గుర్తించారు.
ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని, ఆమె తల్లిని కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో బబ్లూకు కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బబ్లూను అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.