అన్‌స్టాపబుల్ టాక్‌షో సెకండ్ సీజన్‌కు ఊహించని గెస్ట్‌లను ఆహ్వానిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు హోస్ట్ బాలకృష్ణ. అన్‌స్టాపబుల్ సీజన్ -2 డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఇటీవలే రిలీజైన ప్రభాస్ ప్రోమోతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా పవన్ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు. దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ రానున్నారు.
తాజాగా అన్‌స్టాపబుల్ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభమైంది. కాగా ఈ ఎపిసోడ్ ని 2023 సంక్రాంతి సందర్భంగా ఆహా వారు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఆహా టీమ్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుండగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read : వీరసింహారెడ్డి సెట్లో వీరమల్లు.. బాలయ్యతో పవన్ కళ్యాణ్ భేటి..
ఇద్దరూ రాజకీయాల్లోనూ ఉన్న వాళ్లు కావడం.. ఏపీ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన, బాలకృష్ణ కొనసాగుతున్న టీడీపీ కీలకంగా ఉండటంతో.. ఈ ఎపిసోడ్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ఏం అడిగారు ? అందుకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పారు ? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి బాలకృష్ణ ఏమైనా ప్రశ్నలు వేశారా ? దానికి పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా సమాధానాలు చెప్పారా ? ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై ఈ ఎపిసోడ్ ద్వారా క్లారిటీ వస్తుందా ?
ఇలా అనేక ఆసక్తికర అంశాలకు ఈ షో ద్వారా సమాధానం లభించే అవకాశం ఉందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇంట్రెస్టింగ్ షో గురించి ఏపీ మాజీమంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. గతంలో తన బావ చంద్రబాబు చేసిన తప్పులను మాయ చేసేందుకు ప్రయత్నించిన బాలకృష్ణ. ఇప్పుడు తన బావతో తిరిగే వ్యక్తితో షో చేయడంలో ఆశ్చర్యం ఏముందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అన్ని ప్రశ్నలకు, అనుమానాలకు తెరదించాలి అంటే.. పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే..