Nara Lokesh Padayatra – యువగళం దాటాల్సిన మైలురాళ్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగాన పాదయాత్రల సంస్కృతికి బీజం వేసిన వారు మాజీ సీఎం వై.ఎస్ రాజశేఖర్రెడ్డి. అప్పట్లో ఆయన చేసిన పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టి ఆయన్ను అధికారపీఠంపై కూర్చొనేలా చేశారు. ఆయన తరువాత చంద్రబాబు నాయుడు కూడా పెద్దఎత్తున పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు. తదుపరి జగన్ కూడా ఏపీలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసి తన సత్తా చాటారు. ఆయన పాదయాత్రలకు జనం పోటెత్తారు. అదే స్థాయిలో ఆయనకు ఎన్నికల్లో ప్రజలు అద్వితీయమైన విజయాన్ని కూడా చేకూర్చిపెట్టారు.
అయితే పాదయాత్ర టీడీపీ శ్రేణులు అనుకున్నంత సులభం కాదు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని చేపట్టాల్సి ఉంది. నారా లోకేష్ యువగళం కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు ఎన్నో వ్యంగ్యస్త్రా లు సంధిపపడ్డాయి , అధికార పక్షం పెదవి విరుపులు, విమర్శలు మామూలుగానే రాజకీయంగా హల్ చల్ చేసాయి. ఆందరి విమర్శలను తిప్పికొడుతూ కాస్తంత కసరత్తు చేసి కదనరంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది లోకేష్ వ్యవహార శైలి. పదునైన ప్రసంగాలు లేకపోయినా గతంలో కంటే మెరుగైన విధంగా సమస్యలపై స్పందిస్తున్న తీరు ఇటు ప్రజలను, అటు పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. గత పక్షం రోజులుగా యువగళం సాగిన తీరు ఆశాజనకంగానే వుంది.
ఈ సమయంలో ఈ పాదయాత్రను ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లగలుగుతాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఆయన చేసే ప్రసంగాలపైనే విమర్శకులు దృష్టి ఉంటుంది. పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజలతో నారా లోకేష్ ఎలా మమేకమవుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళి నారా లోకేష్ ఏ విధంగా ప్రజలను ఆకట్టుకోగలడా అనేది తెలుగు దేశం శ్రేణుల ముందున్న ప్రశ్న . 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర నారా లోకేష్ వేసే ప్రతి అడుగూ ఆయనకు అగ్నిపరీక్షలాంటిదే, ప్రతి అడుగు చప్పుడూ ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించే హెచ్చరిక లాంటిదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
లోకేష్ తన చరిష్మాతో ప్రజల దృష్టి ఎంతవరకూ అకర్షస్తాడో వేచి చూడాలి. పార్టీలో ఉత్సాహంగా పనిచేసే యువ నాయకులను సైతం పాదయాత్రలో భాగస్వాములని చెయ్యాలి. నియోజక వర్గాల పరిధిలో సమస్యలు, ప్రభుత్వ వైఫ్యల్యాలను పరిణితి చెందిన ధోరణిలో ఎండగట్టాలి. పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం లక్ష్యం నెరవేరే విధంగా క్షేత్రస్దాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చెయ్యాలి. వ్యక్తిగత విమర్శలకు సాధ్యమైనంత దూరంగా వుండాలి. చౌకబారు వ్యాఖ్యల జోలికి పోకుండా… అధికార పక్ష ఆంక్షలను అధికమించి శాంతి యుతంగా సమ్యనమంతో వ్యవహరించాలి. రాద్ధాంతాలను మాని సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆచరణ యోగ్యమైన హామీలు ప్రకటించాలి. మౌలిక సదుపాయాల రూపకల్పన , ఉపాధి, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలలో ప్రస్తుత వైఫ్యలాలు వాటిని అధిగమించటానికి చేయబోయే కార్యాచరణపై స్పష్టత నివ్వాలి. బ్రహ్మణి చురుకైన పాత్ర పోషించాలి. ఆమె చరిష్మా తెలుగు దేశానికి ప్రయోజనకారి కాగలదు.
Also Read : YCP vs Janasena మాకు నమ్మకం లేదు దొరా..
విషయ ప్రస్దావన , భావప్రకట, భాష తదితర అంశాలపై మరింత కసరత్తు.. లోతైన విషయ సేకరణ చేసి కదన రంగంలోకి దూకాలి. తెలుగు దేశం పార్టీలో ఉన్న సీనియర్ల సలహాలు తీసుకుంటూ వారితో నిత్యం సంప్రదిస్తూ అన్ని వర్గాల ప్రాంతల వారిని సమన్వయ పరచుకుంటూ జట్టుగా ముందుకు సాగాలి. గతంలో జరిగిన తప్పిదాలు నేర్పిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, క్షేత్రస్దాయి సమాచారాన్ని విశ్లేషించి కార్యకర్తల సూచనలు సలహాలను క్రోడీకరించి విశ్లేషణ చేసి పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టాలి . అధికారం కోసం పొత్తులు అన్న చందంగా కాకుండా పొత్తుల విషయంలో స్పష్టత నివ్వాలి. పొత్తు పెట్టుకున్న పార్టీని కూడ భాగస్వామ్యులని చెయ్యాలి.
క్షేత్ర స్దాయిలో పార్టీ కేడర్ ఇప్పటికి బలంగానే ఉంది. కార్పోరేట్ టెక్కులు మాని కార్యకర్తలను అక్కున జేర్చుకుంటూ పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ, యువకులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగిన నాడే పాదయాత్ర సఫలీకృతం కాగలదు. పాదయాత్ర ఒక్కటే పదవి దక్కేలా చేస్తుందనేది భ్రమ. ప్రజలతో మమేకమై నమ్మకాన్ని సంపాదించుకోవాలి. పరిణితి చెందిన నాయకుడి గా ప్రజల మన్ననలను పొందాలి అప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యం.
శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు