Nellore Janasena – కేతంరెడ్డి vs మనుక్రాంత్ రెడ్డి..
శత్రువులు ఎక్కడో ఉండరు పదవులు పొందిన నాయకుల రూపం లో సొంత పార్టీలోనే ఉంటారు అన్నట్టు తగలబడింది జనసేన పార్టీలో పరిస్థితి. పార్టీ కోసం వాళ్ళు కష్టపడరు.. కష్టపడే వాళ్లను కష్టపడనివ్వరు.. ఊరుకోరు.. ఇదేం దరిద్రమో జనసేన పార్టీకి.
ఇదేదో ఒక్క సంఘటన చూసి అంటున్న మాట కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఇంతే అవమానాలు ఎదుర్కుంటూ జనసేన కోసం.. పవన్ కళ్యాణ్ కోసం బాధను దిగమింగుకుని. అవమానాలను పట్టించుకోకుండా జనసేనలో కొనసాగుతున్న వారు ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన ఇప్పుడు జనసేనలో కలవరపాటు గురిచేస్తుంది. జనసైనికులు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.

విషయమేమిటంటే.. జనసేన పార్టీ నెల్లూరు సిటీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గత 272 రోజులుగా “పవన్ అన్న ప్రజా బాట” పేరుతో నియోజకవర్గంలో ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీని జనాల్లోకి తీసుకువెళుతున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జనంలోకి జనసేన పార్టీని తీసుకువెళుతున్నారు.
రాష్ట్రంలో జనసేన కోసం కష్టపడుతున్న నాయకుల్లో ఈయన ఒకరని మంచి పేరు ఉంది. నియోజకవర్గంలో కేతంరెడ్డి పనితనం చూసి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలానే కష్టపడే నాయకులు ఉంటే కచ్చితంగా జనసేన అధికారంలోకి వచ్చి తీరుతుందని జనసైనికుల మాట.
కానీ ఇక్కడ విశేషమేంటంటే జనసేన కోసం ఇంటింటికి ఇన్ని రోజులుగా తిరుగుతూ కష్టపడి పార్టీ కోసం పని చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని ఆపేయాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చారు. ఇక్కడ అంత ఒత్తిడి తీసుకొచ్చింది ప్రత్యర్థి పార్టీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. సొంత పార్టీ నుండే ఆయన కార్యక్రమాన్ని ఆపేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.
అయితే వీటిని ఖాతరు చేయక కేతంరెడ్డి నిత్యం ప్రజల్లో తిరుగుతూ నెల్లూరు సిటీలో జనసేనను బలంగా తీసుకు వెళుతున్నారు. ఇపుడు సడెన్ గా నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఈ రోజు కేతంరెడ్డి పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఒక లేఖ విడుదల చేసారు. పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

దీనితో అవాక్కవడం జనసైనికుల వంతు అయింది. పార్టీ కోసం కష్టపడే వాళ్లకు ఇదా గిఫ్ట్ అంటూ కొందరు బాహాటంగానే విమర్శిస్తూ ఉంటే.. ఇంట్లో కూర్చొన్న వాళ్ళను వదిలి ఇంటింటికీ తిరుతున్న వాళ్ళపై వేటా..? అంటూ విరుచుకు పడ్డారు. దీనిపై కేతంరెడ్డి “నన్ను సస్పెండ్ చేయడానికి మనుక్రాంత్ కి అధికారం లేదు.. పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఆపేది లేదు. నా ఊపిరి ఉన్నంత వరకూ జనసేనతోనే ఉంటా..” అని స్పందించారు.
అయితే ఆ లేఖలో రాసిన కారణాలు ఏవైనా సస్పెన్షన్ కి కారణం మాత్రం 2009 లో ప్రజారాజ్యం గెలిచిన సీట్ ఇది. 2019 లో ఓటమి పాలైనా గత మూడు సంవత్సరాలు గా జనసేన ఇక్కడ చాలా బలంగా కనిపిస్తుంది. కేతంరెడ్డి కూడా ఓడిపోయినా జనం లోనే ఉంటూ పార్టీని జనంలోకి బలంగా తీసుకు వెళ్లడం లో సక్సెస్ అయ్యారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లల్లో విస్తృతంగా పర్యటించారు.
అప్పట్లో ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు కూడా ఈసారి జనసేనకు సపోర్ట్ చేస్తాం అని ముందుకు రావడంతో ఇక్కడ నుండి జనసేన తరపున పోటీ చేస్తే కేతంరెడ్డి గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. అందుకే జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ కన్ను ఈ నియోజకవర్గం పై పడింది. దానికి అడ్డుగా ఉన్న కేతంరెడ్డి ని తప్పిస్తే తను వచ్చి ఇక్కడ పాగా వేయాలి అనేది ఆయన ప్లాన్ కావచ్చు అనేది కొందరి మాట.
Also Read : మాకు నమ్మకం లేదు దొరా.. వైసీపీ కి జనసేన స్ట్రాంగ్ కౌంటర్..
ఇక్కడ జరిగింది చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఏ పార్టీ నాయకులు అయినా తమ పార్టీని నిత్యం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అనుకుంటారు. అలా తీసుకు వెళ్లే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ జనసేన లో మాత్రం పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఇలా సస్పెన్షన్ బెదిరింపులకు గురిచేయడం చూసి జనసేన కార్యకర్తలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
