ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేసే
సంక్షేమ పథకాలు కొందరి నిర్లక్ష్యం వల్ల అనుకున్న లక్ష్యాలను చేరడం లేదు. సంక్షేమ పథకాల లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్ఆర్ చేయూత పథకం వలంటీర్ల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. అర్హులైన లబ్ధిదారుల ఆధార్ ను అనుసంధానం చేసే ఈకేవైసీ ప్రక్రియ నిర్వహణలో వార్డు, గ్రామ వలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఎంతో మంది పేదలకు వైఎస్సార్ చేయూత అందేలా కనిపించడం లేదు.
ఈ పథకానికి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన పేద మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు కలిగిన ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కొందరి లబ్ధిదారులకు చెందిన ఆధార్ కార్డుల్లో వయస్సు తక్కువగా నమోదు కావడంతో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈకేవైసీ చేయించుకునేందుకు వాలెంటీర్లను బ్రతిమిలాడుకుంటున్నా వారు ససేమిరా అంటున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి.
ఎవరైనా గట్టిగా మాట్లాడితే, చేయూత కు మీరు అసలు అర్హులు కానే కాదని తేల్చి చెబుతున్నట్లు మరి కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చేయూత పథకంకు సంబంధించి ఈకేవైసీ చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తోన్న వార్డు,గ్రామ వాలంటీర్లపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
