శరన్నవరాత్రుల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మొదట పార్వతి దేవి కనకదుర్గగా పిలవబడుతున్న ఆమె అవతారాలలో ఒకటి. పార్వతి దేవి హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజు పుత్రిక కనుక పార్వతి దేవిగా పిలువబడుతుంది. పర్వతరాజు కుమార్తెగా ఔషధదారునిగా అవతరించింది పార్వతి. తపస్సు ఆచరించి శివుని వరించింది. ధర్మార్ధ, కామ, మోక్ష, చతుర్విధములుగ శైలపుత్రిగా కొలువై ఉన్నది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
శరదృతువులో వస్తాయి కాబట్టి వీటిని శరన్నవరాత్రులు అంటారు. మొదటి రోజు స్వర్ణకవచ దుర్గాదేవి అవతారంలో అమ్మవారు పూజలందుకుంటుంది. స్వర్ణము అంటే బంగారం, కవచము అంటే రక్ష, పార్వతి దేవి అవతారాలలో ఒకటైన స్వర్ణకవచ దుర్గగా పిలవబడుతుంది. ఈ అవతారానికి మూలమైనటువంటి విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉన్న ఒక పురాణగాథ ఉంది.
విష్ణుకుండిన వంశంలో మాధవశర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి వాశాలి అనే కొడుకు ఉండేవాడు అతని కొడుకు ఒక రోజు రథంపై వెళుతుంటే రథం కింద పడి ఒక బాలుడు మరణించాడు. బాలుడి తల్లి న్యాయ గంట మ్రోగించి న్యాయం కావాలని కోరుతుంది. ఆమె కడు బీదరాలు చింతచిగురు అమ్ముకొని కొడుకుని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. మాధవ వర్మ ధర్మాత్ముడు న్యాయ పూర్ణుడు కాబట్టి ఆయన ఆలోచించి.. మరణానికి కారణమైన వారికి మరణ దండనే సముచితమని కొడుకుకి మరణదండన విధించాడు. మాధవ వర్మ ధర్మనిష్ఠకు మెచ్చుకొని అమ్మవారు రథం కిందపడిపోయినటువంటి వాడిని మరణశిక్షతో మరణించిన వాడిని ఇద్దరిని బ్రతికించడమే కాక ఇంద్రకీల పర్వతం విజయవాటికలో కనక వృష్టి కురిపించింది. కనక వృష్టి కురిపించి ఆమె కనుకదుర్గగా పూజలందుకుంది. అలానే దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కావున దేవతలందరూ కనక వృష్టి కురిపించి సత్కరించారు. కవచము అనగా రక్ష, స్వర్ణమే కవచంగా కలిగి ఉంది కాబట్టి శరన్నవరాత్రులలో మొదటి రోజు అవతారమైన స్వర్ణ కవచ దుర్గగా పూజలందుకుంటుంది. ఈ అవతారాన్ని పూజించినవారికి స్వర్ణసిద్ధి, సంపదలు కూడా కలుగుతాయని పురాణం.
