శరన్నవరాత్రులలో రెండో రోజు అవతారం అయినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేకత విశిష్టత గురించి పురాణాల్లో విశేషంగా చెప్పబడింది. లలితమ్మవారి అంశ అయినటువంటి బాల, అమ్మవారి అవతారాలలో ఒకటి. బాల అనగా బాలిక. ఈ బాలా త్రిపుర సుందరి అవతారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. చిన్నారి బాల బాలికల రూపంలో ఈ అమ్మవారిని ఆరాధించాలి.
లలితా అమ్మవారు బండాసుర సంహారానికి బయలుదేరినటువంటి సందర్భంలో బండాసురుడు తన 30 మంది కొడుకులను యుద్ధానికి పంపించాడు. అమ్మవారు లలితా దేవి కూడా తన అంశతో ఒక బాలికను సృష్టించి ఆ బాలికను యుద్ధానికి పంపింది. బాలిక యుద్ధానికి సిద్ధమై వెళుతున్నటువంటి పరాక్రమాలను చూసి జగన్మాత అయినటువంటి లలితాదేవి ఎంతో ముచ్చట పడింది.
బాల పది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బాలిక రూపంలో వెళ్లి బండాసురుని యొక్క ముప్పై మంది కొడుకులను అంతమొందించింది. అటువంటి రూపం ఏదైతే ఉందో త్వరగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందని శాస్త్రం. పూర్వ కాలంలో పిల్లలకు జ్ఞానం రాగానే బాలా మంత్రాన్ని ఉపదేశిస్తుంఉండేవారు శ్రీ విద్య ఉపాసకులు వారికి మొట్టమొదట ఇచ్చే మంత్రం బాలా మంత్రం. శరన్నవరాత్రులలో బాలగా అమ్మవారిని కొలవడం ప్రాముఖ్యత సంతరించుకుంది 2 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలను బాలా అమ్మవారిగా అనుకొని అలంకరించి అమ్మవారికి సిద్ధం చేసిన నైవేద్యాలను వారికి కూడా సమర్పించి, వారిని బాల అమ్మవారిగా అనుకోవడం వల్ల అమ్మవారు మిక్కిలి సంతసించి భక్తులు చేసే పూజలను, అభీష్టాలను త్వరగా అనుగ్రహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రాముఖ్యతను తెలిపే పురాణగాథలలో ఒకటైన త్రిపురాసురులను సంహరించన నాయికగా ఈ కథకు విశిష్టత ఉంది. బంగారం, వెండి, ఇనుము ఈ మూడింటితో తయారుచేసి కట్టుకున్నటువంటి నగరాలను ముగ్గురు అన్నదమ్ములు అయినటువంటి రాక్షసులు ఎక్కడికి కావాలంటే అక్కడికి నగరంతోపాటు తిరుగుతుండేవారు నగరం కూడా అనేక రకాలైన కక్ష్యలో తిరుగుతూ ఉండేదట. ఈ ముగ్గురు మరణం లేకుండా వరం అడిగారు. మేము ముగ్గురం ఒకే వరుసలో ఉన్నప్పుడు బాణం వేస్తే మాలో సరళరేఖగా దూసుకుపోయేటప్పుడు మాత్రమే మరణం ఉండాలని వరం అడిగారు చివరకు శివుడు వారిని సంహరించాడు. సంహరించిన శివునికి త్రిపురహరుడు అని పేరు.
త్రిపురాసురులను సంహరించిన శివునికి నాయికగా ఉండే తల్లి బాలా త్రిపుర సుందరి. త్రిపురాలు అంటే మనలో సత్వ, రజ, తమో గుణాలకు సంబంధించినటువంటి ఆవరుణలుగా చెబుతారు. దశమహావిద్యలలో బాల ప్రత్యేకమైన విద్య. బాలా మంత్రం ఎవరికీ ఉపదేశించకూడదు, అలా ఉపదేశిస్తే సర్వస్వము ఇచ్చినట్టే అని సాధన పూర్వక మంత్ర శాస్త్రం చెబుతుంది.
