Maha shiva Rathri Full Story : 144 ఏండ్లకి ఓసారి మాత్రమే వచ్చే శివరాత్రి ఇది.. అసలు శివరాత్రి వెనుక ఉన్న కథేంటి..??
త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించిన పర్వదినం మహా శివరాత్రి. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, జాగరణలు చేస్తారు. శివనామ స్మరణతో నలుదిక్కులు మారుమోగుతాయి. అయితే శివరాత్రికి ఎందుకంత ప్రాముఖ్యం..? అసలు శివరాత్రికి శివుడికి సంబంధం ఏంటి ఈ పవిత్ర దినాన్ని ఎలా జరుపుకోవాలి..
అసలు శివరాత్రి వెనుకున్న పురాణ కథలేంటి.. ఈ ఏడాది శివరాత్రి అన్నిటికంటే ఎందుకు అంత ప్రాముఖ్యమైనది..??
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏదీ జరగదు అని తెలుస్తుంది.అందుకే శివుడి ఉద్భవానికి సంబంధించిన శివరాత్రికి అంత ప్రాముఖ్యం.
అయితే శివరాత్రి జరుపుకోవడం వెనక రెండు ప్రాచీన కథలు ప్రాముఖ్యంలో ఉన్నాయి. అందులో మొదటిది.. క్షీరసాగర మథనానికి సంబంధించినది. పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందుకు బయటికి వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి పడుకుంటే విషం మొత్తం శివుడి శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకే ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడుతూ పాడుతారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మాఘమాసం వచ్చే బహుళ చతుర్దశి రోజు..వారు ఆడి పాడిన ఐదు జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటూ వస్తున్నాము. ఆరోజు ఉపవాసం జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్లనే ఈశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు.
ఇక రెండవది..విష్ణువు బ్రహ్మల తగువు తీర్చడానికి లింగాకారంలో శివుడు ఉద్భవించడానికి సంబంధించినది. “సృష్టిని తరతరాలుగా రాసేది నేనే కాబట్టి.. నేను గొప్ప” అని బ్రహ్మ.. “ఈ సృష్టి మొత్తాన్ని ముందుకు నడిపించేది.. వాటిని పోషించేది నేనే కాబట్టి.. నేనే గొప్ప” అని విష్ణువు గొడవ పడుతుంటే.. వారి తగువు తీర్చడానికి శివుడు అఖండ లింగాకారంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షం అయిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు.
సాధారణంగా హిందూ పండుగలు అన్ని ప్రత్యేక మాస, తిథి, నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి. మహాశివరాత్రి కూడా అంతే. ప్రతి ఏడాది 12 మాస శివరాత్రులు ఉంటే.. అందులో ఒకే ఒక శివరాత్రిని మహాశివరాత్రి గా జరుపుకుంటాం. అది కూడా చాంద్రమాణ మాసంలోని పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకు ముందు రోజు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి రోజు జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది.ఇది సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే..అన్ని పండుగలు పగలు జరుపుకుంటుంటే దీపావళి, మహాశివరాత్రిలను మాత్రం రాత్రి జరుపుకుంటారు.మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పవిత్ర పర్వదిన కాలంగా భావిస్తారు..అందుకే ఈరోజుకి అంత ప్రాముఖ్యత.
మహాశివరాత్రి పర్వదినాన్ని హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరు అత్యంత పుణ్యప్రదమైన రోజుగా రోజుగా భావిస్తారు. భక్తులంతా అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు. మనసంతా దైవ నామస్మరణ చేస్తూ సాయంకాలం శివుడిని దర్శించుకుని..పండ్లు పాలు ఆహారంగా తీసుకుని ఉపవాస విరమణ చేస్తారు. అక్కడి నుంచి ఆ రాత్రంతా జాగరణ చేస్తారు. జాగరణ చేస్తూ కూడా శివనామస్మరణ స్మరిస్తూనే లింగ రూపుడికి అభిషేకాలు పూజలు నిర్వహించి తరిస్తారు.
జాగరణ పూర్తి అయ్యాక పడుకోవచ్చా..?
జాగరణ పూర్తయిన మరునాడు ఉదయం కూడా పడుకోకూడదు..అలా చేస్తే ఉపవాస జాగరణ ఫలితం దక్కదు అనేది భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి మర్నాడు సాయంత్రం తొలి నక్షత్రం కనిపించిన తర్వాతనే నిద్రపోతారు. అప్పటివరకు శివనామ స్మరణ చేస్తూనే ఉంటారు.
ఈ శివరాత్రికి ఎంతో విశిష్టత :
ఈసారి మహాశివరాత్రి ప్రతి ఏడాది వచ్చే శివరాత్రి లాంటిది కాదంటూ పండితులు చెప్తున్నారు. 12 పుష్కరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి ఈసారి రానుందని.. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ శివరాత్రికి శివయ్య దర్శనం కలుగుతుందని చెబుతున్నారు. ఈసారి శివరాత్రి శనివారం నాడు.. అది కూడా శని త్రయోదశి రెండు కలిసి రావడం మరో విశేషం.ఇక శివరాత్రి ఈసారి ఉత్తరాషాడ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం లలో రాబోతుండడం ఒక గొప్ప విశేషం. ఉత్తరాషాడ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాగా.. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శివరాత్రి రోజున శివయ్యకి ఆరాధన చేస్తే మానసిక సమస్యలు అలాగే మనసులోని ఆందోళన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం.
అందుకే మహాశివరాత్రి పర్వదినాన కనీసం శివలింగం దర్శనం చేసుకున్నా.. సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దానికి తోడు 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన శివరాత్రి కావడంతో.. ఈ ఏడాది శివరాత్రికి మరింత ప్రాశస్త్యం ఉందని భక్తులంతా విశ్వసిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహా శివుడి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ…
ఓం నమఃశివాయ..!!