Yadadri Laxminarasimha Temple :యాదాద్రి కొండపై భక్తుల కష్టాలు… ఎండాకాలం తాళలేక విల విల
ఈ ఎండాకాలం లో యాదాద్రికి వచ్చే భక్తులకి భానుడి రూపంలో కొత్త కష్టాలు తోడయ్యాయి.రాష్ట్రం లోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రిలో కనీసం ఏర్పాట్లు కూడా సరిగా లేవని భక్తులు మండిపడుతున్నారు.దేవస్థానానికి వస్తున్న వేలాది మంది భక్తులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల బాధలు వర్ణనాతీతం గా ఉన్నాయ్. దేవాలయం అంతా కృష్ణ రాతి శిలలతో చూడ ముచ్చటగా ఉంటూనే.. భక్తుల కాళ్ళు మాత్రం నరకం అనుభవిస్తున్నాయి.
ప్రభుత్వం, దేవాలయ అధికారులు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని కనీసం చలవ పందిళ్ళు కూడా ఏర్పాటు చేయకపోవడం చూసి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 దాటితే చాలు ప్లోరింగ్ బండల నుండి వచ్చే వేడి సెగలకు భక్తులు పరుగులు తీస్తున్నారు.
150 టికెట్ తో శీఘ్ర దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకి నిలువ నీడ లేకుండా పోయింది. ఆలయంలో స్వామి దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చిన భక్తులు, ప్లోరింగ్ బండల వేడికి తాళలేక పరుగులు తీస్తున్నారు. వృద్ధులు వేగంగా నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పిల్లలతో వచ్చిన భక్తుల గోస ఇంకా ఘోరంగా తయారు అయింది. ఇప్పటికైనా ఆలయ అధికారులు చొరవ తీసుకొని చలవ పందిళ్ళు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.