TwoMuch Talk Show: కాజోల్, ట్వింకిల్ ఖన్నాల క్రేజీ కాంబో.. ఓటీటీలోకి సరికొత్త టాక్ షో!
TwoMuch Talk Show: ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన టాక్ షో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ అగ్ర తారలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” పేరుతో ఒక సరికొత్త టాక్ షోను ప్రారంభించనున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలతో పాటు, సెలబ్రిటీల టాక్ షోలకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’, ‘కాఫీ విత్ కరణ్’ వంటి బాలీవుడ్ షోలు, అలాగే తెలుగులో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’, రానా ‘ది రానా దగ్గుబాటి షో’ వంటివి అద్భుతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో, తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించడానికి కాజోల్, ట్వింకిల్ ఖన్నా వంటి ప్రముఖ తారలు కలిసి వస్తుండటం విశేషం.
దీన్ని మిస్ చేయడం టూ మచ్..
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షో గురించి ప్రకటిస్తూ, తమ సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. “వాళ్ల దగ్గర టీ ఉంది. దీన్ని మిస్ చేయడం టూ మచ్. టూ మచ్ ఆన్ ప్రైమ్, త్వరలోనే” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసి, ఈ షోపై ఆసక్తిని మరింత పెంచింది. “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” షోలో భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ షోకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా రానున్నారని సమాచారం.
they've got the tea ☕ and it's two much to miss 👀#TwoMuchOnPrime, Coming Soon @Banijayasia @mrsfunnybones @itsKajolD @deepak30000 @NegiR @BalanGirish @jahnvio #MrinaliniJain #ShyamRathi pic.twitter.com/SbDAGbrBf4
— prime video IN (@PrimeVideoIN) July 22, 2025
50 ఏళ్ల వయసులోనూ అదే అందంతో..
50 ఏళ్ల వయసులోనూ అదే అందంతో వరుస సినిమాలు చేస్తూ కాజోల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘మా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం ‘సార్జామీన్’, ‘మహారాగ్ని’ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మరోవైపు, 2001లో అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ట్వింకిల్ ఖన్నా, రచయిత్రిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1995 నుంచి 2001 వరకు హిందీలో వరుసగా సినిమాలు చేసిన ట్వింకిల్, తెలుగులో వెంకటేష్ సరసన ‘శీను’ సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజ తారల కలయికలో రానున్న ఈ టాక్ షో ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.