Ranbir Kapoor: రామాయణం కోసం ఆ సింగర్ బయోపిక్‌ను వదులుకున్న రణబీర్ కపూర్..!
Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ సినీ కెరీర్‌లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేందుకు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దివంగత గాయకుడు, నటుడు కిశోర్ కుమార్ బయోపిక్‌ను వదులుకున్నారని ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు. ఈ నిర్ణయం సరైనదేనని బసు ప్రశంసించారు. రణ్‌బీర్ తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సమయంలో సరైనది ఎంపిక చేసుకున్నారని ల్లో అభిప్రాయపడ్డారు.
అనురాగ్ బసు, రణ్‌బీర్ కపూర్‌ల కలయికలో ఇదివరకు ‘బర్ఫీ’ మరియు ‘జగ్గా జాసూస్’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరు మళ్లీ కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, వారి బిజీ షెడ్యూల్స్ కారణంగా అది కుదరడం లేదు. “నేను రణ్‌బీర్‌తో మరో సినిమా చేయాలని ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. కానీ కుదరడం లేదు” అని బసు అన్నారు.
రణ్‌బీర్ కపూర్ రామాయణలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా, రణ్‌బీర్ బయోపిక్ నుండి తప్పుకోవడంతో, కిశోర్ కుమార్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై అనురాగ్ బసు ఆచితూచి స్పందించారు. “అంతా ఖరారై, అగ్రిమెంట్‌పై సంతకాలు చేసేంత వరకు నేను దీని గురించి మాట్లాడకూడదని అనుకుంటున్నాను” అని బసు అన్నారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాజెక్ట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని, కాంట్రాక్ట్ కుదిరితే తప్ప అధికారికంగా వెల్లడించలేనని ఆయన తెలిపారు.
అనురాగ్ బసు ఇటీవల దర్శకత్వం వహించిన ‘మెట్రో… ఇన్ డినో’ చిత్రం జూలై 4న విడుదలై మంచి స్పందన పొందింది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆషికి 3’ చిత్రం 2026 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.