Vibe Undi Song: ప్రేక్షకుల డిమాండ్‌కు తలొగ్గిన మిరాయ్ మూవీ టీమ్.. ఇకపై ఆ మెరుపు
Vibe Undi Song: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘మిరాయ్’. థ్రిల్లర్, యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ. 134 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుతమైన స్పందన, మౌత్ టాక్ కారణంగా, చిత్రబృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరిక మేరకు సినిమాలో నుంచి తొలగించిన ‘వైబ్ ఉంది బేబీ’ పాటను మళ్లీ థియేటర్లలో చేర్చనుంది.
సినిమా విడుదల కంటే ముందే ఈ ‘వైబ్ ఉంది బేబీ’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, సినిమా థియేటర్లలో చూసినప్పుడు ఈ పాట లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను విడుదల చేసినప్పటికీ, కథాంశానికి అడ్డుగా ఉంటుందని భావించి దర్శకుడు కార్తీక్ దాన్ని తొలగించినట్లు తెలిపారు. కానీ, ప్రేక్షకుల నుంచి ఈ పాటను మళ్లీ సినిమాలో చేర్చమని పెద్ద ఎత్తున ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనిపై స్పందించిన చిత్రబృందం, మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ప్రదర్శితమవుతున్న అన్ని షోలలోనూ ఈ పాటను యాడ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ పాట ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుందని, చిత్రానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘వైబ్ ఉంది బేబీ’ పాటకు గౌర హరి సంగీతం అందించగా, కృష్ణకాంత్ సాహిత్యం రాశారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో ‘మిరాయ్’ హవా కొనసాగుతోంది. దసరా సెలవులతో పాటు, ఇప్పుడు ఈ ‘వైబ్ ఉంది బేబీ’ పాటను చేర్చడం వల్ల మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG Movie) విడుదల అవుతున్నప్పటికీ, ‘మిరాయ్’ తన ప్రభావాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు.