Varahi VijayaYathra in Mangalagiri : రాజ్యం.. రాజ్యాధికారం ఎవరి సొంత సోత్తు కాదు. దాన్ని జన్మహక్కులా భావించి ఒక్కరే ఎల్లవేళలా అనుభవిస్తామంటే కుదరదు, పదిమంది కూర్చొని రాష్ట్రాన్ని మొత్తం నడిపిస్తామంటే ఊరుకోబోమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రకాశం జిల్లా కు చెందిన వైసీపీ నాయకుడు శ్రీ ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) శనివారం తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
స్వాములుకు పార్టీ కండువా వేసిన పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఉన్నతి కోసం పూర్తిస్థాయిలో పని చేయాలని సూచించి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చింది. కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఈ పోరాటంలో మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. శ్రీకాళహస్తిలో కొట్టి సాయి అనే జన సైనికుడిపై చేయి వేసిన పోలీసుల తీరును ప్రశ్నించేందుకు సోమవారం తిరుపతి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో ప్రతి జన సైనికుడుకీ, వీర మహిళకు అండగా నేనుంటాను.
ప్రజా సమస్యలపై జగన్ అంటే భయం లేకుండా తెగించి పోరాడుదాం. ప్రజాక్షేత్రంలో నిత్యం ఈ ప్రభుత్వ తీరును ఎండగడదాం. ఈ పోరాటంలో ఎవరిపై దెబ్బపడినా నాపై దెబ్బ పడినట్లే భావిస్తాను. ఈ ప్రభుత్వాన్ని దేహి,దేహి అని అడగాల్సిన పరిస్థితి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను ఖచ్చితంగా.. వినియోగించుకుందాం. నియంత పాలన చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు పాటించి మా బతుకులు మేం బతుకుతాం.
మా బతుకులను నిర్దేశిస్తామంటే మాత్రం ఊరుకోం. ఆమంచి స్వాములు గారి లాంటి నాయకుల బలమే జనసేనకు కావాలి. తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు నిలబడే నాయకులు, సమస్యలపై కడదాకా పోరాడేతత్వం ఉన్న స్వాములు జనసేనలో చేరడంతో ప్రకాశం జిల్లాలోనే కాదు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది.
భారీ బలగంతో ఆయన చేరిక పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. ఆయన రాకతో నాకు కూడా చిన్ననాటి అనుబందం ఉన్న చీరాల చిన్నరదం, పెద్దరడం, జాండ్రపేట టక్కున గుర్తుచ్చాయి. ఇక నుంచి మూడు జిల్లాల్లోనూ స్వాములు సేవలు పార్టీ ఉన్నతికి మరింత ఉపయోగపడతాయని భావిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.