Varahi VijayaYathra : తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వాలంటీర్లు సేకరిస్తున్న సున్నితమైన డేటా ఎక్కడికి వెళ్తుంది.. ఎటుపోతోంది..? దానివల్ల జరిగే దుష్పరిణామాలు మీదే నా పోరాటం. రోజుకు కేవలం రూ. 164.38 పైసలు వేతనం ఇస్తూ జగ్గు భాయ్ చేయిస్తున్న పాడు పనిలో భాగం కావొద్దు అని వాలంటీర్లకు చెప్పడమే నా ఉద్దేశం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే కేంద్రం తీసుకువచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్టివ్ ప్రకారం శిక్ష తప్పదు.
దీన్ని వాలంటీర్లు తెలుసుకోండి. వారికి అర్ధం కాకపోతే వాలంటీర్లు తల్లిదండ్రులు అయినా మీ బిడ్డలకు చెప్పండి. వాలంటీర్లతో నాకు ఇబ్బంది కాదు. జనసేనకు – జగ్గు భాయ్ కి మధ్య జరిగే యుద్ధమిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాకు జరిగే సున్నితమైన అంశం అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం ఆలంపురంలోని జయగార్డెన్స్ లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వీర మహిళలు, జనసైనికుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. దౌర్జన్యంతో కూడిన క్రిమినల్ రాచరికం రాజ్యమేలుతుంది. దీనికి ప్రైవేటు ఆర్మీ.. వాలంటీర్లే, పంచాయతీ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్ధను ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యమంత్రి జగ్గు భాయ్, వాళ్ల గ్యాంగ్.. ఏపీ తమదే అనే భ్రమలో ఉన్నారు. త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తాం. వాలంటీర్ల డేటా సేకరణ, అది నిక్షిప్తం చేస్తున్న చోటు, ఈ మొత్తం తతంగంపై జనసేన న్యాయ పోరాటం చేస్తుంది.
నా దిష్టిబొమ్మలు తగలబడితేనో, నా ఫోటోలను చెప్పులతో కొడితేనే నేను వెనక్కు తగ్గే వ్యక్తిని అసలు కాదు. నేను వాలంటీర్లు అందరినీ అనడం లేదు. తప్పు చేస్తున్న వారినే అంటున్నాము. అందరూ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు సేకరించిన డేటా వాట్సప్ గ్రూపుల్లో బయటకు వెళ్తుంది. మీరు అందరూ సేకరించిన డేటా హ్యాక్ చేయడానికి ఒక్క వ్యక్తి దాలు. అయినా ప్రజల ఇంటి గుట్టు వాలంటీర్లకు ఎందుకు తెలియాలి..? వారి పరిధిలోని ఇళ్లలో ఎవరు పుష్పవతి అయినా, గర్భవతి అయినా వాలంటీర్లకు తెలియాల్సిన అవసరం ఏంటి..? మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనేది వాలంటీర్లకు ఎందుకు..? అని పవన్ ప్రశ్నించారు.