తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక పై రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు న్యాయ పరమైన చర్యలకు పూనుకున్నారు. హనీ ట్రాప్-ఇద్దరి కలెక్టర్ల కహానీ పేరుతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ ల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆంధ్రజ్యోతి పత్రికకు లీగల్ నోటీసులు పంపించారు. రాష్ట్రంలోని కలెక్టర్ల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించినందుకు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ,బహిరంగ క్షమాపణ తో పాటు ఆ క్షమాపణలు పత్రికలో ప్రచురించాలని వారు డిమాండ్ చేశారు.
వారం రోజుల గడువు లోపు క్షమాపణ తెలియజేయకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కలెక్టర్లు పంపించిన నోటీసులో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలం నుండి కలెక్టర్లను, కలెక్టర్ల వ్యవస్థను ఎంతో గౌరవప్రదంగా చూస్తున్నారు. అలాంటి వ్యవస్థపై బురదజల్లే విధంగా కథనాలు ప్రచురించడం ఏమిటని వారు ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ప్రజల క్షేమం కోసం పాటుపడే కలెక్టర్లను కించపరచడం దారుణమని వారు వ్యాఖ్యానించారు.
మీ రాజకీయ బాసులను సంతృప్తి పరిచేందుకు అబద్ధపు రాతలతో కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను మీ కలం పోటుతో దిగజార్చారు. మీపై మేము జాలి చూపిస్తున్నాం. మీరు నైతిక విలువలు పూర్తిగా గాలికొదిలేసి అబద్ధాల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మీ బురద జల్లుడు తప్పుడు నిందారోపణలు వలన ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్న దేశంలోని కలెక్టర్ల అందరి నైతిక స్థైర్యాన్ని మీరు దెబ్బతీశారు.
దీనికి మీరు తగిన మూల్యం చెల్లించాల్సినభాద్యత ఉందని వారు పేర్కొన్నారు. మీరు రాసిన కథనాల వల్ల మా కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి అని ఆవేదన వ్యక్తంచేశారు. వారం లోపు క్షమాపణ చెప్పని పక్షంలో తదుపరి చర్యలకు కలెక్టర్లు సిద్ధమవుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.