అస్తమానం అటే తిరుగుతావ్
ఒక్కసారి కూడా ఇంటికి రావు
కనీసం మా ఇల్లు చూడటానికి కూడ నీకు రావాలని లేదా??
మొన్నే బస్తర్ టేకుతో మంచం చేయించాను
ఒకసారి వచ్చి చూడు అన్నాడో మిత్రుడు
ఎప్పుడూ బయట మాట్లాడటమే తప్ప మిత్రుల ఇంటికెళ్లి మాట్లాడే అలవాటు లేదు నాకు
ఇంటికి వెళితే కాస్త పద్ధతి గా మాట్లాడాలి
మనకి లేనిదే అది
పల్లెటూరి భాష
మూడు మాటల్లో రెండు బూతులు సహజంగా వచ్చేస్తాయి
అటే వెళుతున్న నన్ను చూసి లోపలకి రమ్మన్నాడు
ఇక తప్పదని బలవంతంగా వెళ్ళాను
ఇల్లంతా తిప్పి చూపించాడు
మార్బుల్స్ అమెరికా నుంచి..
డోర్లు ఢాకా నుంచి..
డైనింగ్ టేబుల్ డెన్మార్క్ నుంచి..
రంగులు రష్యా నుంచి అని చెప్పుకుని పోతూనే వున్నాడు
ఇటుక సిమెంట్ తప్ప ఇండియా సరుకు ఏమీలేదని
చెప్పకనే చెప్పాడు
తెల్లటి గ్లాస్ తో టీ తెచ్చి ఇస్తే గ్లాసునే చూస్తున్నాను
ముట్టుకుంటే మట్టి గాని అంటుకుని మాసిపోతుందా అని డౌటానుమానం నాకు.
చివరిగా బెడ్ రూమ్లోకి వెళ్ళాను
ఇంటీరియర్ డిజైనర్ ఎవడో డిజైన్ చేసినట్టున్నాడు..
గదంతా రంగులు..
లైట్ వేస్తే పూర్వం రికార్డింగ్ డాన్స్ స్టేజ్ దగ్గర వెలిగే రంగు రంగుల లైట్లు.
ఠీవిగా గది మధ్యలో బస్తర్ టేకు మంచం
కూర్చుంటే మనిషిని మొత్తానికి మంచంలోకి లాక్కుపోయే మెత్తటి పరుపు
భయమేసి చెంగున లేచి కుర్చీలో కూర్చున్నాను
వస్తూ వస్తూ పక్కనే చాప..
దానిపై పత్తి దూదితో చేసిన దిండు..
మొబైల్ ఛార్జర్ చూసి ఇదేంటి అని అడిగా…
బ్యాక్ పెయిన్ వల్ల డాక్టర్ మంచం మీద పడుకోవద్దు అన్నాడట
రోజూ చాప మీదే నిద్రట
అసలు విషయం చెప్పాడు
హత విధి..
ఆ మాత్రం దానికి ఇల్లే కావాలా??
నాలా చెట్టు కింద పడుకుంటే చాలదా??
