అమరావతి రాజధాని అంశం టిడిపి లో సంక్షోభానికి కారణం అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన చాలా మంది టిడిపి నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాక అమరావతి ఉద్యమం పేరుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు అమరావతి మద్దతుగా ఉండాలని పిలుపునివ్వడంతో.. ఉత్తరాంధ్ర టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విశాఖ రాజధాని సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోయినా వ్యతిరేకత అయితే ఏమీ లేదన్న సంగతి గమనించిన కొంతమంది టీడీపీ నేతలు నాయకులు వైసిపి వేసిన వలలో తమకు తెలియకుండానే చిక్కుకునిపోతున్నారు.
ఇప్పటికే గంటా శ్రీనివాసరావు వైసిపి లో చేరడానికి సిద్ధంగా ఉండగా ఎమ్మెల్యే గణబాబు వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు ఇదివరకు టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన అనేకమైన కీలకమైన నాయకులు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నష్ట నివారణ కోసం తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రస్తుతానికి వ్యూహం ఏమీ లేకపోగా కోర్టు తీర్పు తో సహా కేంద్రం మద్దతుతో రాజధాని నిర్మాణం చేపడితే ఇక్కడ స్థానిక ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి అనే ప్రశ్నలు వారిని వేధిస్తుండడంతో వారు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు, లేనిపక్షంలో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతున్నదనే భయం తమను వేదిస్తున్నట్టు సన్నిహితులతో చెబుతున్నారు. జనవరి తర్వాత విశాఖ కేంద్రంగా జరిగే రాజకీయ పరిణామాలకు తెలుగుదేశం పార్టీ కి ఉత్తరాంధ్ర జిల్లాలు పెద్ద సవాల్ అని భావిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.
