చాలామంది నటీనటులు సినిమా చిత్రీకరణలో స్టంట్స్ చేసే సమయంలో డూప్ అవసరం లేకుండా నటిస్తూ ఉంటారు. సినిమా పై ప్రేమ, ప్రేక్షకులను అలరించాలనే తపన వారిని ఎంత కష్టమైనా భరించేలా చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు అవి వారి ప్రాణానికే ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయి. కొవిడ్ కారణంగా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో టోవినో థామస్ తీవ్రంగా గాయపడిన వార్త ఆందోళన కలిగిస్తుంది. అసలే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు ఇలాంటి సమయంలో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది.
ఈ యువ హీరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈయన ఇటీవల తెలుగులో విడుదలైన ఫోరెన్సిక్ , ఆస్కార్ గోస్ టూ అనే డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. రాబోయే కాలంలో షూటింగ్ లో బిజీగా ఉన్న టోవినో ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కడుపులో దెబ్బ బలంగా తగలడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి తీవ్ర గాయంతో కొచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో ఈయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా మారిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. టోవినో థామస్ కు ప్రమాదం జరిగిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మలయాళ సినీ ఇండస్ట్రీ షాక్ కు గురయింది.