వివాదాస్పద సినీ క్రిటిక్ మహేష్ కత్తి అరెస్టుకి కారణాలు చాలానే ఉన్నాయి. మొదట్లో పవన్ ఫ్యాన్స్ తో మొదలైన వివాదంతో పాపులర్ అయిన ఈయన క్రమంగా తన ధోరణి మార్చుకున్నారు. మొదట్లో కొన్ని వర్గాల సానుభూతి పొందిన మహేష్ తర్వాత తన నోటికి పని చెప్పి విలువ కోల్పోయారు. వైసీపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ రాజకీయంగా అవకాశాల కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మెజార్టీ వర్గాలను కించ పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఒకటి రెండుసార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మతాలని రెచ్చగొడుతూ తరచుగా మాట్లాడంతో పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే మహేష్ పై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో వైసీపీ కూడా మహేష్ ని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు.
రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే పక్షంలో వ్యక్తులని సమర్ధించే పనికి దూరంగా వుంటాయని ఈ ఘటనతో రుజువైంది. ఇప్పుడు మహేష్ కత్తి కి మద్దతు గా వైసీపీలో ఎవరూ సానుకూలంగా ప్రకటన చేయకపోవడం గమనార్హం. అరెస్ట్ ఘటన పై పార్టీ స్పందిస్తే మెజారిటీ హిందువుల మనోభావాలకి వ్యతిరేకంగా వెళ్లినట్టు కొంతమంది ప్రచారం చేసే అవకాశం ఉండడంతో చివరకు ఆయన ఒంటరిగా మిగిలారు.