విజయవాడ వాసులకు దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ సెప్టెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఫ్లై ఓవర్ గా 2015లో దీని శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం లో కాలయాపన జరిగి ఎట్టకేలకు పూర్తయింది.
ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత తమదేనని అటు టీడీపీ, ఇటు వైసిపి విమర్శల పర్వం మొదలు పెట్టారు. నాటి టిడిపి హయాంలో నిర్మాణం విషయంలో అలసత్వం ప్రదర్శించరనడం వాస్తవం. రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి కావాల్సిన ఈ ఫ్లైఓవర్ ఐదేళ్ల సుదీర్ఘ కాలం పాటు నిర్మాణం జరిగింది. 223 కోట్ల ప్రతిపాదనతో మొదలైన నిర్మాణం పూర్తయ్యేనాటికి దాదాపు 450 కోట్ల రూపాయలకు చేరింది.
2014 నుండి విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని పలుసార్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, ఆయన ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా నిర్మాణం మాత్రం ముందుకు సాగేది కాదు. వైసీపి ప్రభుత్వం ఏర్పడే నాటికే 75 శాతం పైగా నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్మాణం పూర్తయిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే దాన్ని పూర్తి చేసారని, ఈ ఘనత ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వానిదే అని అంటున్నారు. అత్యంత రద్దీ కలిగిన ఈ ప్రదేశంలో సుదీర్ఘకాలంపాటు నిర్మాణం చేయడం టిడిపి ప్రభుత్వ చేతగానితనం అని అంటున్నారు.
ఏది ఏమైనా నిర్మాణ సమయంలో విజయవాడ వాసులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు అనేది వాస్తవం. ఇప్పుడు ఏ పార్టీకి క్రెడిట్ ఇవ్వాలనే దానికంటే తమ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి అనే సంతోషమే ప్రజల్లో కనిపిస్తుంది.
