సిక్కోలు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు జరుగుతున్నాయా? టీడీపీ పై ఎర్రన్నాయుడు కుటుంబం అసంతృప్తిగా ఉందా? టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బీజేపీ గూటికి చేరనున్నట్టు వస్తున్న వార్తలు ఇటువంటి అనుమానాలకి తావిస్తోంది. టీడీపీ అధిష్టానంపై చాలామంది నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఆందోళనలో ఉన్న రామ్మోహన్ నాయుడు టీడీపీ అగ్రనేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలిసింది. ఆయన విడుదల కోసం పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చెయ్యలేదని, దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమ కుటుంబం ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ గా మారిందని, అరెస్ట్ తర్వాత పార్టీ వైఖరి సరిగ్గాలేదని ఆయన అభిపాయపడుతున్నట్టు తెలిసింది. జిల్లాలో పార్టీ బలం క్రమంగా బలహీనపడుతున్న కారణంగా ఆయన కొంతకాలం వేచిచూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జిల్లా నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
బీజేపీలో రామ్మోహన్ నాయుడుకు అగ్రనేతల ఆశీస్సులు ఉన్నాయని, ఆయన ప్రతిభని గమనించిన కొందరు బీజేపీ సీనియర్లు జిల్లాలో పార్టీ పటిష్టతకు ఆయన ఉపయోగపడతారని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే జిల్లా టీడీపీకి భారీ నష్టం తప్పదు.కాకపోతే ఇవన్నీ ఊహాజనిత వార్తలని ఆయన టీడీపీలోనే కొనసాగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.