ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడానికి దేశంలోని వివిధ ఫార్మా కంపెనీలు తీవ్రస్థాయిలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ దశలో వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక ప్రకటన నిన్న ప్రధాని మోడీ చేశారు. త్వరలోనే కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని దేశంలో ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందే విధంగా అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధత తో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ సమస్యలు, వ్యాక్సిన్ వచ్చిన తరువాత ప్రజలకు ఏ విధంగా అందించాలి అనే విషయంపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వచ్చాక దానిని పంపిణీ చేయాల్సిన విధానం గురించి కీలకమైన సూచనలు చేశారు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో ఈ సమావేశంలో చర్చించారు. వ్యాక్సిన్ నిల్వచేయడం, వ్యాక్సిన్ వేయడానికి ఉపయోగించే సూదులు కొనుగోలు,ఇలా ప్రతి అంశం పైన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశం అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కి సంబంధించి భారతదేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని, వీటిలో ఒకటి మూడోదశ ప్రయోగాల స్థాయికి చేరుకుందని ఈ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ జన్యుపరంగా స్థిర రీతిలో ఉందని, మార్పులకు గురి కాలేదని అందువల్ల వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.