రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. ఒకప్పటి మిత్రులు నేడు శత్రువులు గా మారవచ్చు. ఒకప్పటి శత్రువులు ఓకే పార్టీలోకి వచ్చిన తర్వాత మిత్రులు గా మారవచ్చు.
గంటా శ్రీనివాస్ ఒకప్పుడు ప్రజారాజ్యం,ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర విభజన పరిణామాల్లో పతనమైన కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే
ఆ పార్టీలో చేరడం ఆయన స్టైల్. పార్టీలు మారుతూ వచ్చినా తన ఆధిపత్యాన్ని నిలుపుకున్న వ్యక్తి.
అదే కోవలో ఉత్తరాంధ్రకు చెందిన అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ కి అనుంగ మిత్రుడిగా ఉంటూ కలిసి సాగిపోతూ దృఢమైన స్నేహబంధం కలిగి ఉండేవారు. గత ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ తరఫున గంటా శ్రీనివాస్ టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు.
కాలం మారింది అవంతి అధికార పార్టీలో మంత్రి పదవి దక్కించుకుని ఉత్తరాంధ్రలో పట్టు కోసం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అదే సమయంలో అధికారులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరే గంటా శ్రీనివాస్ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అని ప్రచారం వెలుగులోకి వచ్చింది.
ఇక్కడే ఒకప్పటి మిత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తయారయ్యాయి.గెలిచిన పార్టీలో ఉన్న అవంతి గంటా శ్రీనివాస్ వైసీపీ లోకి వస్తే తన ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందనే ఆలోచనతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అందుకే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో గంటా శ్రీనివాస్ పై అవంతి నిప్పులు చెరిగారు.
చేసిన తప్పులు నుండి తప్పించుకొని అరెస్టు కాకుండా ఉండడానికే దొడ్డిదారిన వైసీపీ లోకి రావడానికి గంటా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ రాజధానిగా త్వరలోనే పరిపాలన ప్రారంభించాలి అనుకుంటున్న అధికార పార్టీకీ ఒకపక్క కోర్టులో చుక్కెదురు అనుకుంటే ఇంకోపక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటలు స్వాగతం పలుకుతున్నాయి.
మరి ఈ పరిణామాలు ఎంత వరకు అధికార పార్టీ సర్దుబాటు చేస్తుందో చూడాలి.
