మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెచ్చామని, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంతప్ప ఆచరణలో ఏదీ కనిపించడం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని శివపురం తండాలో గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం అమానవీయమని,ఈ ఘటన చూసి తన హృదయం ద్రవించిందని పవన్ పేర్కొన్నారు.
అటవీ భూమిని తనఖా పెట్టుకోవడమే చట్టరీత్యా నేరం కాగా, పైగా ఆ భూమిని స్వాధీనం చేసుకుని మంత్రుబాయి కుటుంబాన్ని అక్కడ అడుగుపెట్టకుండా చేయడం దారుణమంటూ,
ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా వెలిగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గిరిజన మహిళపై భర్త కళ్లెదుటే సామూహిక అత్యాచారం జరిగితే కేసు నమోదు చేయలేదని,ప్రతి కేసు విషయంలోనూ ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా విమర్శించారు.