ఏపీ సీఎం జగన్ తిరుపతి పర్యటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి తిరుమల ఆలయంలో ప్రవేశించాలంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే అని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు ఇరు పక్షాల మధ్య వాడి వేడి మాటల యుద్ధాలకు తెరలేపాయి. చంద్రబాబు ఒక లుచ్చా, ఒక హిందూ ద్రోహి అలాంటి వ్యక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించగా.. దీనిపై టిడిపి వర్గాల నుండి తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేడు తిరుమలకు రానున్న సందర్భంగా చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం జగన్ తిరుపతికి వచ్చినప్పుడు చిత్తూరు నేతలు డిక్లరేషన్ పై పట్టుబట్టాలని, నిరసనలు తెలపాలని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి నేతలు సీఎం జగన్ నుండి డిక్లరేషన్ కోరుతూ లేఖలు రాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పర్యటనకు చిత్తూరు జిల్లా పోలీసులు తిరుపతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
