దొమ్మేరులో ముసలాయన చనిపోయాడట. పరామర్శకి వెళదాం అంటే బయలుదేరక తప్పలేదు. దారిలో ఆగి స్వీట్స్ కొనాలి. ఎందుకూ? అని అడిగాను.
పరామర్శిండడానికి వెళితే స్వీట్స్ పట్టుకుని వెళ్ళాలి అని చెప్పారు.
అసలే దుఃఖంలో ఉంటే స్వీట్లా??
బాగోదేమో అని కొద్దిగా ఆలోచించాను.
జనరల్ గా జనంలో కలిసే అలవాటులేని నాకు సోషల్ డిస్టన్స్ కరోనా కి ముందునుంచే వుంది. ఏడిస్తే ఎలా ఓదార్చాలో అనుకుంటూ వెళితే అక్కడ పిల్లలు ఒక పండగలా ఆడుకుంటున్నారు. ఊళ్ళో ఖాళీగా ఉన్న పెద్దమనుషులు కుర్చీలో కూర్చుని అప్పుడప్పుడు టీ తాగుతూ రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.
నా ఊహకు భిన్నంగా ఎక్కడా ఎవరికీ విచారం లేదు. పిల్ల వేగుల సమాచారంతో ఎవరో వస్తున్నారని తెలిసిన ఇంట్లో ఆడలేడీస్ ఏడుపు అందుకున్నారు. అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. రెండే నిముషాలు ఏడ్చిన వాళ్ళు తర్వాత ఇతర టాపిక్స్ లో దిగారు.
బంగారం రేటు బాగా పెరిగిందట కదా..
మీ అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరిందా..
సూరిబాబు గారి కోడలికి ఇంకా కడుపురాలేదట..
హైదరాబాద్ లో ఫలానా వారి అబ్బాయి అపార్ట్మెంట్ కొన్నాడట. ఇవీ మాటలు..
ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పాటలు వింటూ ఊగుతూ టీ పట్టుకుని వచ్చి ఇచ్చెళ్లిపోయింది. ఆ మనవరాలు అంటే పోయిన ముసలాయన కి చాలా ఇష్టమట
పెరట్లోనుంచి కొబ్బరి కమ్మల పొయ్యిలో వండుతున్న చికెన్ మధురమైన వాసన వస్తోంది. కొంచెం దూరంగా వెళ్లి సిగరెట్ కాల్చుకుని నిశ్శబ్దంగా బయలుదేరాను.
బాధకి కి కూడా ముగింపు తేదీ ఉంటుంది. తర్వాత క్రమంగా తగ్గిపోయిందని జీవిత సారాంశం.
