ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్ యాప్ ని ఇప్పుడు చాలా దేశాల్లో బ్యాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వ్యాధికి కారణంగా చెబుతున్న చైనా ని దోషిగా నిలబెట్టటంలో భాగంగా టిక్ టాక్ ని చాలా దేశాల్లో నిషేధించారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా వరుసగా చైనా యాప్స్ పై నిషేధం కొనసాగుతూనే ఉంది. దీనితో టిక్ టాక్ వరుసగా నష్టాల్లోకి నెట్టబడింది.
భారతదేశంలో అయితే సరిహద్దు వివాదంలో భాగంగా దీనిపై అందరికంటే ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. చైనాతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాలు సైతం రద్దు చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. చైనాని ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రపంచంలో కొన్ని దేశాలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.
ఇది గ్రహించిన టిక్ టాక్ యాజమాన్యం టిక్ టాక్ కు సంబంధించిన హక్కుల్ని దేశాల వారీగా విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించిన తర్వాత వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. భారత దేశంలో ఈ హక్కులను ముఖేష్ అంబానీ చేజిక్కించునే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇండియన్ టిక్ టాక్ గా దీన్ని రూపాంతరం చేసి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
