కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చేసేందుకు పనులు లేక ప్రజలు ఊరి బాట పట్టారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు దర్శనమిచ్చాయి. మొదట్లో ఈ వైరస్ తో భయపడుతూ వచ్చినా.. ప్రజల్లో కొంత అవగాహన పెరిగిన తర్వాత శానిటైజేషన్, మాస్క్, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. చాలా మంది కార్మికులకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజు పనికి వెళ్తే గాని పూట గడవదు. త్వరలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయనున్నారన్న సమాచారంతో బస్సులు లేకపోయినా ఎవరి వాహనాల్లో వాళ్లు ఇప్పుడిప్పుడే సిటీ కి చేరుకుంటున్నారు.
ఆఫీసులకు వెళ్లేవాళ్లు, ఆటో నడిపే వాళ్ళు, కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభం కావడంతో రోజు కూలీ చేసుకునేవాళ్లు, ఇలా లాక్ డౌన్ సమయంలో ఖాళీగా కనిపించిన రోడ్లు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగి రద్దీగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కరోన బెడద పోయి ఎప్పటిలానే మామూలు పరిస్థితులు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.