ఏపీలో గుంటూరు జిల్లాలో ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ లు మార్చి మహిళలను వైయస్సార్ చేయూత పథకానికి అర్హులయ్యేలా చేస్తున్న కేటు గాళ్ళు తయారయ్యారు. వీళ్ళు ఆ ఒక్క పధకమే కాదు గత మూడు నెలల్లో దాదాపు 500 మందిని పైగా వివిధ పథకాల్లో అర్హులైయ్యే విధంగా ఆధార్ కార్డులు మార్పులు చేర్పులు చేశారు. దీనికోసం ఆధార్ కార్డు లో మార్పులు చేయడానికి అనుమతి పొందిన ఒక ఏజెన్సీతో కుమ్మక్కయ్యారు.
దీనిపై నిఘా పెట్టిన పోలీసులు మెరుపు దాడి చేసి 8 మందిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే.. ఈ ముఠా నకిలీ పత్రాలతో స్టాంప్ పేపర్ లను ఫోర్జరీ చేసి వైయస్సార్ చేయూత మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులు అయ్యేలా ఆధార్ కార్డు లో మార్పులు చేశారు. దీనికిగాను ఒక్కొక్కరి దగ్గర 4000 వసూలు చేశారు. ఇలా చేయడం వల్ల అర్హత లేనివారు ప్రభుత్వ పథకాలు పొంది ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేకాక వీరు ఆధార్ కార్డు తో అనేక అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని గుంటూరు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన దాడిలో వారి వద్ద నుండి రబ్బరు స్టాంపులు, ఐరిష్ కెమెరా, స్కానర్, 20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.