తెలంగాణ రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోనున్నారా? ఆయన దృష్టి ఇపుడు ఢిల్లీ రాజకీయాలపై పడిందా అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర బాధ్యతలన్నీ తన కుమారుడు కేటీఆర్ కి అప్పగించి ఇకపై హస్తినలో చక్రం తిప్పాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలని ఆయన ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా బిజెపి రోజురోజుకీ బలపడుతూ ఉండడంతో.. ఆ పార్టీని ఆత్మ రక్షణలో నెట్టడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలతో ప్రాథమిక చర్చలు ముగించినట్టు తెలుస్తుంది.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనించిన ఆయన ఇక ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపై రాకపోతే వాటి మనుగడ కూడా ప్రమాదమని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడంతో బిజెపి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం కెసిఆర్ దృష్టిలో లేకపోలేదు. తన పదునైన వ్యూహం ద్వారా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి కమలనాథుల ను కట్టడి చేయాలని ఆయన ప్రయత్నం కావచ్చు.
ఇప్పటికే తన కుమారుడు కేటీఆర్ కి రాష్ట్ర బాధ్యతల్లో అనుభవం ఉన్నందున పరిపాలనపై ఆందోళన చెందే అవసరం లేదని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఢిల్లీ రాజకీయాలపై పట్టు సాధిస్తే.. దేశవ్యాప్తంగా ప్రతిష్ట పెరగడంతోపాటు దేశంలో మూడో ప్రత్యామ్నాయం కోసం కీలకమైన పాత్ర పోషించవచ్చనీ తద్వారా NDA లో తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్న నాయకులకు తమ బలం తెలిసేలా చేయాలన్నది ఆయన వ్యూహం. దీనిలో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
