గోదావరి జిల్లాలో గత ఎన్నికల తర్వాత చాలామంది రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఎన్నికలకు ముందు, ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన చాలామంది నాయకులు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అటువంటి నాయకులు ఏం చేస్తున్నారనే కుతూహలం చాలామందిలో ఉంది.
ముఖ్యంగా టీడీపీలో ఒక వెలుగు వెలిగిన తోట త్రిమూర్తులు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. త్రిమూర్తులు రాకను రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు మరియు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం సర్ది చెప్పడంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆయన రాకను స్వాగతించారు.
తర్వాత జరిగిన పరిణామాలు రీత్యా బోస్ రాజ్యసభకు వేణు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో త్రిమూర్తులుని అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జ్ గా మండపేట కో ఆర్డినేటర్ గా పార్టీ నియమించింది. రానున్న ఎన్నికల్లో మండపేట నుంచి తోటని బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది.
ఇప్పటికే టీడీపీ అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గ పరిధిలో తోట తనదైన దూకుడుతో మండపేట కైవసం చేసుకుంటారా, లేక ఎన్నికల ముందు తన సొంత నియోజకవర్గం పై దృష్టి సారిస్తారా అనేది వేచి చూడాలి.
