ప్రతివారిలోనూ ప్రపంచానికి తెలిసిన కోణం కాకుండా, చీకటిలో దాగుండే వికృత కోణాలు కూడా ఉంటాయి. అవి బయటకు కనబడవు. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. నూతన్ నాయుడు విషయంలో అదే జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా నూతన్ నాయుడుకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. చాలామందికి ఒక కామన్ మెన్ గా అతడంటే చక్కని అభిప్రాయం కలిగింది.
కానీ.. తాజాగా అతడి ఇంట్లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటన తరువాత బయటపడుతున్న వాస్తవాలు చూస్తే ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎదుగుతున్న నూతన్ నాయుడు చేసే మోసాలు విశాఖ పెందుర్తి లో శిరోముండనం ఘటన తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐఫోన్ పోయిందనే నెపంతో, మరియు బ్యూటీషియన్ ఇందిర ఫోటోలను స్కాన్ చేశాడని ఆరోపిస్తూ దళిత యువకుడు శ్రీకాంత్ ను చితకబాది అక్కడే శిరోముండనం చేశారు. నూతన్ నాయుడు ఇంట్లో ఐదు నెలలు పనిచేసిన శ్రీకాంత్ ఆగస్టు ఒకటో తారీఖున పని మానేశాడు.
సమగ్ర దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.సంఘటన జరిగిన రోజు ఆరు సెల్ ఫోన్ లు సీజ్ చేసారు. సంఘటన జరిగే సమయంలో ఉన్న సి సి ఫుటేజ్ పరిశీలించినప్పుడు బయటపడిన వాస్తవం ఏమిటంటే నూతన్ నాయుడు ఆధ్వర్యంలోనే శిరోముండనం చేశారని నూతన్ నాయుడు పాత్ర ఉందన్న విషయం వెల్లడైంది. అంతేకాక ఒక రిటైర్డ్ ఐఏఎస్ అయిన పీవీ రమేష్ పేరు తో నూతన్ నాయుడు మోసాలు చేస్తున్నట్లు తెలిసింది. దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలను చూస్తే పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి మరియు గాజువాక సిఐకి పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు కాల్స్ చేశారని, అంతే కాక మరో 30 మంది అధికారులతో నూతన్ నాయుడు తన పేరుతో మాట్లాడారని తన పేరును మిస్ యూజ్ చేస్తున్నారని పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో నూతన్ నాయుడు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు చేసిన మోసాల గురించి లోతైన దర్యాప్తు జరుగుతుంది ప్రస్తుతం కర్ణాటకలోని ఉడిపి లో తలదాచుకున్న నూతన్ నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రెండు రోజుల్లో విశాఖకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయట పడతాయో చూడాలి.
