గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న తోట త్రిమూర్తులు ఇప్పుడు కొత్త రాజకీయ ప్రయత్నం మొదలుపెట్టారు. ఎన్నికల అనంతరం పార్టీ మారిన త్రిమూర్తులు, పార్టీ ఆదేశాల ప్రకారం మండపేటపై దృష్టి సారించారు. టీడీపీలో ఓటమి తర్వాత ఆయన వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన రాకను అడ్డుకునేందుకు అప్పట్లో కొంతమంది తీవ్రంగా ప్రయత్నించినా.. జగన్ ఆదేశాల మేరకు వారు వెనక్కి తగ్గారు. తోట సమర్ధత, నైపుణ్యం తెలిసిన అధిష్ఠానం ఆయనను అమలాపురం పార్లమెంట్ పరిధిలో కొన్ని కీలకమైన భాద్యతలు మరియ మండపేట ఇన్ ఛార్జ్ గా నియమించి భాద్యతలు అప్పగించింది.
మండపేటపై దృష్టి పెట్టిన తోట రంగంలోకి దిగగానే చెల్లాచెదురుగా ఉన్న పార్టీ శ్రేణులని ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. పార్టీ బలంగానే ఉన్నా స్థానిక నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్లే వరస ఓటములు ఎదురవుతున్న సంగతిని పార్టీ కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై ఆయన స్థానికంగా అందుబాటులో ఉండి పార్టీని ముందుకు నడిపించాలనే బలమైన సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే తమ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం పెద్ద కష్టంకాదని స్థానిక నాయకులు భావిస్తున్నారు.
అయితే, మండపేట లో వరస విజయాలు సాధించి దూకుడు మీద ఉన్న టీడీపీ MLA వేగుళ్ల జోగేశ్వర రావుని ఆయన ఎలా కట్టడి చేస్తారనే అంశంపై కొద్దిపాటి సందేహాలు ఉన్నాయి. స్థానికంగా టీడీపీ బలంగా ఉండటం, సౌమ్యుడిగా పేరు ఉండటం వేగుళ్లకు కలిసివచ్చే అంశం. కానీ తోట, స్థానిక ఎన్నికల నాటికే పూర్తి స్థాయిలో మండపేటపై పట్టు సాధిస్తారని, సవాళ్ల ఆయనకు కొత్తకాదని, జగన్ చరిష్మాతో పాటు తోటకి ఉన్న అనుచర గణం, కార్యదక్షత తో ఆయన పూర్వ వైభవాన్ని పొందడం పెద్ద విషయం కాదనీ స్థానిక పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
